వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త దుర్మార్గాలకు, కొత్త ఎత్తుగడలకు ప్లాన్ చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, తీసుకుంటున్న నిర్ణయాలు సర్వత్రా జనామోదం పొందుతూ ఉండడంతో.. ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి లేదా, ఆ రకమైన దుర్మార్గపు ప్రచారం సాగించడానికి కొత్త ఎత్తుగడలు వేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా పాల్గొనే కార్యక్రమాల్లో కిరాయి మనుషుల ద్వారా నిరసనలు తెలియజేయించాలని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయించాలని ప్లాన్ చేస్తున్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ప్రభుత్వానికి సమాచారం అందినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. అయితే ప్రభుత్వం కూడా వైసీపీవారి ఈ కుట్రలు, ఎత్తుగడలకు విరుగుడుగా తదనుగుణమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం గమనార్హం.
కర్నూలు జిల్లా పుచ్చకాయల మాడ అనే గ్రామంలో చంద్రబాబునాయుడు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు. ఈ గ్రామంలో చంద్రబాబు కార్యక్రమానికి ఇరుగు పొరుగు గ్రామాల నుంచి కిరాయి మనుషులను తరలించి.. వారి ద్వారా నిరసనలు తెలియజేయాలని వైసీపీ స్కెచ్ వేసింది. అందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి కార్యక్రమంలో పాల్గొనడానికి ఊర్లోని ప్రజలు ఎటూ ఊర్లోనే ఉంటారు. బయటి ఊర్లనుంచి వచ్చే వారి ద్వారా రభస చేయించాలని అనుకున్నారు. కనీసం ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా.. సభలో ఎక్కడో ఒక గొంతుక వినిపిస్తే చాలు.. దానికి చిలవలు పలవలు చేర్చి.. ఈ ప్రభుత్వం పట్ల వందరోజులు గడవకముందే ప్రజల్లో అసంతృప్తి ప్రబలిందని, తప్పుడు కథనాలు వండుతూ ప్రచారం చేయాలనేది వారి ప్లాన్. అయితే ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ఇలాంటి కుట్రలు ముందుగానే ప్రభుత్వానికి సమాచారం అందాయి.
పోలీసులు ఈ సభకు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. సాధారణంగానే ముఖ్యమంత్రి కార్యక్రమం గనుక పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఊరిలో ఉన్న ప్రజల విషయంలో ఎలాంటి తనిఖీలు చేయలేదు. అయితే కార్యక్రమం సమయానికి ఇతర ప్రాంతాల నుంచి గ్రామంలోకి రావడానికి ప్రయత్నించిన వారిని మాత్రం ఆధార్ కార్డు చూపిస్తే తప్ప గ్రామంలోకి వెళ్లినిచ్చేది లేదని ఆంక్షలు పెట్టారు. బాబు సభలో రాద్ధాంతం చేయడానికి ఇరుగు పొరుగు గ్రామాల నుంచి ఆటోల్లోను, ఇతర మార్గాల్లోనూ తరలివచ్చిన కిరాయి మనుషులు పోలీసుల ఆంక్షలతో ఖంగుతిని తిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆ రకంగా ఆ గ్రామానికి చెందిన పౌరులుగా ధ్రువీకరించే ఆధార్ కార్డులు లేని అనేకమందిని పోలీసులు వెనక్కు తిప్పిపంపడం గమనిస్తే, వైసీపీ పెద్దస్థాయిలోనే ఫ్యాబ్రికేటెడ్ నిరసనలకు ప్లాన్ చేసిందని అర్థమవుతోంది.