రంగంలోకి దిగుతున్న సుప్రీంకోర్టు న్యాయవాదులు

‘చిన్న పామునైనా సరే పెద్ద కర్రతో కొట్టాలి’ అనే సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి! తమ కుటుంబ ఆస్తుల పంపకానికి సంబంధించిన వివాదం చిన్నదే అయినప్పటికీ దాని గురించి ఆయన ప్రస్తుతం ఏ కంపెనీల ట్రిబ్యునల్ లో అయితే పిటిషన్ వేశారో.. ఆ న్యాయస్థానం కూడా చిన్నదే అయినప్పటికీ జగన్ మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి అన్నట్లుగా ఈ చిన్న కేసు విషయంలో తమ వాదనలు వినిపించడానికి ఏకంగా సుప్రీంకోర్టులో పేరుమోసిన న్యాయవాదులను కార్యరంగంలోకి తెస్తున్నారు.

జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అవినీతి కేసులు, సిబిఐ ఈడి కేసులను గతంలో సుప్రీంకోర్టులో ఎంతో అనుభవం ఉన్న సీనియర్ న్యాయవాదులు వాదించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వం తరఫున వేసిన అనేక కేసుల విషయంలో కూడా సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాదుల సేవలను వాడుకున్నారు. ఇప్పుడు ఆయన సొంత కుటుంబ వివాదం కోర్టుకెక్కింది. దీనిని పరిష్కరించడానికి ఆషామాషీగా వ్యవహరించకూడదని జగన్ అనుకుంటున్నారు.

చిన్న వివాదమే అయినా సరే ఒకేసారి దీనికి ఫుల్ స్టాప్ పెట్టేయాలని జగన్ అనుకుంటున్నారు. అందుకే ఢిల్లీకి చెందిన న్యాయనిపుణులతో మంతనాలు సాగిస్తున్నట్టు సమాచారం. తాజాగా బెంగుళూరు యలహంక ప్యాలెస్ కు వెళ్లిన జగన్.. అక్కడినుంచి న్యాయనిపుణులతో చర్చలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటినుంచే సుప్రీం న్యాయవాదుల్ని రంగంలోకి దించడానికి మరో కారణం కూడా ఉన్నదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ట్రిబ్యునల్ లో ఈ పిటిషన్ నెగ్గుతుందనే నమ్మకం జగన్ కు కూడా లేదని, ఇక్కడ కేసు వీగిపోయిన తరువాత హైకోర్టులో అప్పీలు చేసుకోవాల్సి వస్తుందని.. అప్పటికైనా సుప్రీం న్యాయవాదుల అవసరం పడుతుందని ఆయన ముందే ఫిక్సయినట్టుగా చెబుతున్నారు. అందుకే ఇప్పుడే  బాగా సీనియర్లను రంగంలోకి దించుతున్నట్టు తెలుస్తోంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories