సునీల్ సీక్రెట్స్ : ఆ నలుగురు ‘హత్య’లో ఎందుకు లేరు?

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ2 నిందితుడు, ప్రస్తుతం బెయిలు మీద బయట ఉన్న సునీల్ యాదవ్ ఇప్పటికే వైసీపీ నాయకుల నుంచి ప్రాణహాని ఉందని ఆందోళన చెందుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మేరకు ఆయన కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదుచేసి, పోలీసు కేసు కూడా పెట్టారు. ఇటీవల విడుదల అయిన హత్య సినిమాను ఎందుకు తీశారో, ఎవరిని నిందితులుగా ప్రొజెక్టు చేయడానికి ఈ హత్య సినిమా ద్వారా ఒక ప్రయత్నం జరిగిందో.. సునీల్ యాదవ్ పదేపదే చెబుతున్నారు. అదే క్రమంలో భాగంగా.. ఆ సినిమాలో దాచిపెట్టిన సత్యాల గురించి.. సీక్రెట్స్ గురించి.. కొత్త ప్రశ్నలను సంధిస్తున్నారు!

హత్య సినిమాలో, అసలు వివేకానందరెడ్డిని హత్య చేసినది ఎవరో దాదాపుగా తేల్చేసినట్టుగా చూపించడం పట్ల ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ప్రదర్శనలు కూడా నిలిపేయాలని ఆయన ఆల్రెడీ పోలీసులకు ఫిర్యాదు చేసి ఉన్నారు. ఆ సినిమాను ఎవరు తీశారో.. ఎవరు తీయించారో.. ఎందుకు తీయించారో సమస్తం త్వరలోనే వెలుగులోకి వస్తాయని కూడా అంటున్నారు.

అయితే ఆయన తాజాగా బయటపెడుతున్న సంగతేంటంటే.. హత్య సినిమాలో కేవలం నలుగురిని మాత్రమే నిందితులుగా చూపించారని.. కేసులో అసలు సూత్రధారులైన వారిని నామమాత్రంగా కూడా ప్రస్తావించలేదని సునీల్ యాదవ్ ప్రశ్నిస్తున్నారు. హత్య సినిమాను ఆ కేసులో చార్జిషీట్ ప్రకారమే తీసినట్టుగా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చెప్పడాన్ని ఆయన నిలదీస్తున్నారు. వివేకా హత్యకేసులో 8మందిపై చార్జిషీట్ ఉంటే.. ఈ సినిమాలో కేవలం నలుగురి పేర్లే చూపించారని.. మిగిలిన నలుగురి పేర్లు ఎందుకు బయటపెట్టడం లేదని అడుగుతున్నారు.

ఈ సినిమాలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర రెడ్డి, ఉదయ కుమార్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పేర్లు ఎందుకు చూపించలేదని అడుగుతుండడం గమనార్హం. ఒకవైపు అవినాష్ రెడ్డి హత్యకు ప్రధాన సూత్రధారిగా అనేక ఆరోపణలు వెల్లువెత్తుతుండగా.. అప్రూవర్ గా మారిన నిందితుడు దస్తగిరి మాటలు కూడా అదే వాదనను బలపరుస్తుండగా.. ఆ విషయాలన్నింటినీ ఈ సినిమా దాచిపెట్టడం సర్వత్రా వివాదాస్పదం అవుతోంది. దస్తగిరి కడప జైల్లో ఉండగా.. అవినాష్ రెడ్డికి అనుకూలంగా సాక్ష్యాలు చెప్పాలంటూ.. 20 కోట్ల ఆఫర్ తో బేరగాళ్లను పంపిన వైనం వంటివి కూడా ఈ చిత్రంలో కనీస ప్రస్తావన లేకుండా పోయాయి.

దస్తగిరిని అచ్చమైన విలన్ గా మాత్రమే ప్రొజెక్టు చేశారు. అందుకే సునీల్ యాదవ్ గట్టిగా నిలదీస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డిని.. కేవలం ఆస్తుల కోసం.. ఆయన కూతురు సునీత, అల్లుడు రాజశేఖర రెడ్డి కలిసి కుట్ర చేసి చంపించినట్లుగా చాటి చెప్పడానికి హత్య సినిమా ప్రయత్నిస్తున్నదని చూసిన వారికి అర్థమవుతుంది. సినిమా రూపంలో  కొత్తగా జరుగుతున్న కుట్ర సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories