నెల్లూరులో మంత్రి నారాయణ తన శ్రద్ధతో ఆధునిక హంగులను అందుబాటులోకి తీసుకువచ్చి తను చదివిన వీఆర్ హైస్కూలును ఒక ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దారు. ఒక మునిసిపల్ స్కూలు బయట ‘సీట్లు ఖాళీ లేవు’ అని బోర్డు పెట్టే పరిస్థితి వచ్చిందంటే.. నిజానికి చాలా గొప్ప విజయం. నిరుపేదలు కూడా.. తమ పిల్లలను ప్రెవేటు స్కూళ్లలోనే చేర్పించడం అనేది ఇవాళ్టి రోజుల్లో ఒక మోజు అయిపోయింది. ఇలాంటి రోజుల్లో ఆదోనిలోని మరో ప్రభుత్వ పాఠశాల ఇదే రికార్డు నమోదు చేసింది. నెహ్రూ మునిసిపల్ హైస్కూలు బయట నో ఎడ్మిషన్స్ బోర్డు పెట్టారు. ఇప్పటికే అక్కడ 1725 మంది విద్యార్థులున్నారు. మరో 400 మంది ఈ ఏడాది కొత్తగా చేరారు. ఇంకా చేరడానికి వస్తూనే ఉన్నారు. ఇది చాలా గొప్ప విజయం అని చెప్పాలి. ఇలాంటి విజయాలు ప్రభుత్వ రంగంలో విద్యావ్యవస్థను మెరుగ్గా తీర్చిదిద్దడానికి తమ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్న ప్రభుత్వానికి ఎంతో తృప్తిని కలిగిస్తాయనడంలో సందేహం లేదు.
నెల్లూరులో వీఆర్ హైస్కూలు ప్రెవేటు స్కూళ్లకు దీటుగా ఆధునిక కంప్యూటరు హంగులతో విద్యాబోధనకు అనువుగా తయారైన తర్వాత.. ఆ స్కూలు ప్రారంభోత్సవం సందర్భంగా నారా లోకేష్ ఒక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోను కనీసం ఒక పాఠశాలను ఈ స్థాయిలో తీర్చిదిద్దాలని అనుకుంటున్నట్టుగా ఆయన వెల్లడించారు. నిజానికి అది చాలా గొప్ప సంకల్పం.
నారా లోకేష్ తీసుకుంటున్న ప్రతి చర్య కూడా.. ప్రభుత్వ విద్యావ్యవస్థ మీద ప్రజల్లో నమ్మకం, గౌరవం పెరగడానికి కారణం అవుతున్నాయనే భావన ప్రజల్లో ఉంది. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మెగా పేరంట టీచర్స్ మీటింగులు ఏర్పాటు చేయడం ఒక అద్భుతం అయితే.. అదే సమయంలో పాఠశాలల్లో విద్యాప్రమాణాల మీద ప్రజల్లో నమ్మకాన్ని పెంచగలగడం మరో విజయం.
చంద్రబాబునాయుడు సారథ్యంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం.. అన్ని రంగాల అభివృద్ధి మీద సమానంగా శ్రద్ధ పెడుతున్నదనడానికి ఇలాంటివే నిదర్శనం. అమరావతి రాజధాని నిర్మాణం గురించి.. ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తలెత్తుకుని సగర్వంగా చెప్పుకోగలిగే రాజధానిని నిర్మించడం అనేది తెలుగు ప్రజల స్వప్నం. ఆ స్వప్నాన్ని సాకారం చేసేదిశగా చంద్రబాబునాయుడు ఎక్కువ శ్రమపడుతున్నారు. అందుచేత.. రాష్ట్రంలో ఇతర రంగాలు విస్మృతికి గురవుతున్నాయనే చెడ్డ పేరు రాకుండా ఉండడానికి ఇలాంటి విజయాలు కీలకం అవుతాయి. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల ముందు నో ఎడ్మిషన్స్ బోర్డులు అనేవి చాలా గొప్ప సంగతి. నారా లోకేష్ తాను సంకల్పిస్తున్నట్టుగా ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి ఒక పాఠశాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురాగలిగితే.. ఎన్డీయే ప్రభుత్వం కీర్తి భావితరాల్లో చిరస్థాయిగా ఉండిపోతుంది.