2019లో కూడా పవన్ కల్యాణ్ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొని ఉండవచ్చు గాక.. కానీ 2024 ఎన్నికలను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ఆయన పొత్తు బంధంలో ఉన్నారు. ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉంటాయి. 2014లో కూడా పొత్తుల్లో ఉన్నారు గానీ.. అప్పట్లో ఆయన పార్టీ ఎన్నికల్లో పోటీచేయనేలేదు. కాబట్టి ఇప్పుడు పార్టీ పరంగా ఒక భిన్నమైన వాతావరణాన్ని ఆయన డీల్ చేయాలి. అందులో పవన్ కల్యాణ్ లో కాస్త తడబాటు కనిపిస్తోంది.
పార్టీ బలపడుతున్నప్పుడు.. ఒక్కొక్క సీటు నుంచి టిక్కెట్టు ఆశించే వారి సంఖ్య పెరుగుతుంది. టిక్కెట్టు ఒక్కరికే దక్కుతుంది గనుక.. మిగిలిన వారిలో ఖచ్చితంగా అసంతృప్తి ప్రబలుతుంది. వారిని బుజ్జగించాలి. పొత్తులతో బరిలోకి దిగుతున్నప్పుడు.. సొంత పార్టీ వారు ఎంతో ఆశలు పెట్టుకున్న నియోజకవర్గాలకు ఇతర పార్టీలకు వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటప్పుడు.. ఆశలు కుంగిపోయిన వారికి సర్ది చెప్పాలి. అలాగే తమ పార్టీకి దక్కిన సీట్లలో మిత్రపక్షాల వారు అసంతృప్తితో వేగిపోతుంటారు. వారినందరినీ కలుపుకుపోవాలి. కానీ ఇలాంటి ప్రయత్నాల్లో జనసేనాని పెడుతున్న శ్రద్ధ అంత ఫలవంతంగా కనిపించడం లేదు. ఆయన ఇంకాస్త సీరియస్ గా ఫోకస్ పెట్టాల్సి ఉంది.
ఫరెగ్జాంపుల్.. పిఠాపురంలో పోటీచేస్తానని పవన్ ప్రకటించిన తర్వాత, తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వర్మ వర్గంలో తీవ్రమైన అసంతృప్తి రేగింది. ఆయన ఇండిపెండెంటుగా పోటీచేయడానికి సిద్ధపడిపోయారు. కానీ, చంద్రబాబు వర్మను పిలిపించి సర్దిచెప్పారు. అంతా సర్దుకున్న తర్వాత.. పవన్ ఆ వ్యవహారాన్ని మళ్లీ కెలికారు. అక్కడి తమ పార్టీ ఇన్చార్జి తంగెళ్ల ఉదయ్ ను కాకినాడ ఎంపీగా ప్రకటించిన తర్వాత.. ఒకవేళ మోడీ, అమిత్ షా తనను ఎంపీగా చేయమని కోరితే.. తామిద్దరం నియోజకవర్గాలు మార్చుకుంటామని (swap) చేసుకుంటామని అన్నారు. ఈ మాటలు మళ్లీ అగ్గిని పుట్టించాయి. పవన్ గనుక ఎంపీగా పోటీచేస్తే.. పిఠాపురం నియోజకవర్గాన్ని వదిలేది లేదని, ఎమ్మెల్యేగా తానే బరిలో ఉంటానని వర్మ తేల్చి చెప్పేశారు. పవన్ పోటీచేస్తే మాత్రమే.. రక్తం ఒడ్డి అయినా ఆయనను గెలిపిస్తానని అన్నారు. పవన్ అనవసరంగా.. పిఠాపురం తెలుగుదేశంలో మళ్లీ ఇలాంటి ఆలోచనల్ని రేకెత్తించారు.
తిరుపతి నియోజకవర్గం మరో ఉదాహరణ. చిత్తూరు సిటింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులును తిరుపతి అభ్యర్థిగా పవన్ ప్రకటించారు. కానీ.. ఈలోగా, అక్కడి స్థానిక నాయకులు అందరికీ ముందే సర్దిచెప్పాలన్న సూత్రాన్ని మర్చిపోయారు. అక్కడ రచ్చరచ్చ అవుతోంది. ఇప్పుడు విశాఖలో వంశీకృష్ణ కు కేటాయించిన స్థానం కూడా అలాగే ఉంది. ఒకరికి కేటాయించేప్పుడు అక్కడ మిగిలిన వర్గాలను ముందే బుజ్జగించాలి. అలాంటి పని జనసేన పార్టీ పరంగా సరిగా జరగడంలేదు. ఇలాంటిది ముందుముందు చాలా గందరగోళానికి దారితీసే అవకాశం ఉంది. పవన్ ఇప్పుడే జాగ్రత్త పడితే పార్టీకి మేలు.