ఆయన ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ తరఫునే ఎంపీగా గెలిచారు. కానీ అయిదేళ్లపాటూ జగన్మోహన్ రెడ్డికి ఊపిరి ఆడనివ్వకుండా విమర్శల జడివాన కురిపించారు. ఆయన మీద కక్ష తీర్చుకోవడానికి జగన్ సీఐడీ ద్వారా రాజద్రోహం కేసు పెట్టించి తీవ్రంగా వేధించారు. తీవ్రంగా కొట్టించారు. అసలు జగన్ అప్పటి అధికారులు కలిసి తన మీద హత్యాయత్నం చేశారంటూ ఆయన కొన్ని రోజుల కిందట పోలీసుకేసు కూడా పెట్టి ప్రతిరోజూ ఫాలో అప్ చేస్తున్నారు. ఇంత జరిగినా సరే.. అసెంబ్లీలో జగన్ తారసపడగానే.. ఆత్మీయంగా ‘హాయ్ జగన్’ అంటూ పలకరించి.. వెళ్లి ముచ్చట్లు పెట్టారు. అన్ని చిన్నెలతో వెరైటీగా వ్యవహరించగల నాయకుడు మరెవ్వరైనా ఉంటారా.. అంటే.. ఉండరేమో అనే సమాధానం వస్తుంది. ఆయన మరెవ్వరో కాదు ఉండి ఎమ్మెల్యే రఘురామక్రిష్ణ రాజు.
రఘురామ క్రిష్ణ రాజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి తిట్టిన మాటలను గమనించినా.. అరెస్టు చేయించి రఘురామను జగన్ కొట్టించిన తీరును గమనించినా.. వీరిద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుందని ఎవరైనా అనుకుంటారు. వీరిద్దరూ పరస్పరం తారసపడితే చాలు కొట్టేసుకుంటారేమో అని కూడా అనుకుంటారు. కానీ.. అసెంబ్లీ ప్రాంగణంలో జగన్ కనిపించగానే.. రఘురామ హాయ్ జగన్ అంటూ దగ్గరకు వెళ్లి పలకరించారు. జగన్ భుజం మీద చేయి వేసి మరీ రఘురామ పలకరించారు. ఆ వైనం చూస్తున్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారు.
ఈ ఇద్దరు నాయకులు అసెంబ్లీలోనే మళ్లీ తారసపడ్డారు. అప్పుడు రఘురామ జగన్ తో మాట్లాడుతూ.. ‘ప్రతిరోజూ అసెంబ్లీ రా జగన్’ అంటూ కోరారు. ‘రెగ్యులర్ గా వస్తాను మీరే చూస్తారుగా’ అంటూ జగన్ సమాధానం ఇచ్చారు. జగన్ చేతిలో చేయి వేసి మరీ.. ఎంతోకాలంనుంచి ఇద్దరూ ఆత్మీయ స్నేహితులు అయినట్టుగా రఘురామ మాట్లాడడం విశేషం.
ఇంతకంటె సరదాగా అనిపించే ట్విస్టు ఏంటంటే.. వారిద్దరూ ముచ్చట్లు చెప్పుకుంటున్న సమయంలో ఆర్థిక మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అటుగా వెళుతూ కనిపించారు. కేశవ్ ను రఘురామ పలకరించి.. తనకు జగన్ పక్కనే సీటు వేయించాలని కోరారు. తప్పకుండా అలాగే వేయిస్తానంటూ.. కేశవ్ అక్కడినుంచి నవ్వుకుంటూ వెళ్లిపోయారు. సాధారణంగా అధికారపక్షం వారందరికీ ఒకవైపు, ప్రతిపక్షం వారికి ఇంకోచోట సీట్లు కేటాయిస్తారు. తాను అధికారపక్షం ఎమ్మెల్యేగా ఉంటూ జగన్ పక్కన సీటు వేయించాలని రఘురామ కోరడం అందరికీ నవ్వు తెప్పించింది.