వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి ప్రత్యక్ష రాజకీయాల్లో తలపడి, ప్రజల మనసులు గెలుచుకుని విజేతగా నిలిచే పటిమ ఉన్నదా? ఆయన ఎంత సీనియర్ నాయకుడు అయినప్పటికీ..
జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ పార్టీలో నెంబర్ టూ నాయకుల పేర్లలో గుర్తింపు ఉన్నవాడు అయినప్పటికీ.. ఈ విషయం మాత్రం సందేహమే. ఎందుకంటే.. ఆయన చేతిలో పార్టీమీది పెత్తనం ఉన్నది గనుక.. పార్టీ నాయకులు అందరూ ఆయన ప్రాపకం కోసం ఎగబడుతుంటారు గనుక, జగన్ ఆయన మాటకు విలువ ఇస్తారు గనుక.. ఆయన కీలకనేతగా ‘పార్టీలో’ చెలామణీ అయ్యారే తప్ప.. ప్రజల్లో కూడా ఆయనకు అంతే విలువ ఉన్నదా? అనేది సందేహం. ఆ విషయం ఇప్పుడు నిరూపణ అవుతుంది. ఎందుకంటే.. ఆయన నెల్లూరు ఎంపీగా లోక్ సభ బరిలో ఉన్నారు.
ప్రత్యక్ష రాజకీయాలు అలవాటు లేని విజయసాయిరెడ్డి ప్రస్తుతం మాట్లాడుతున్న మాటలు .. ఆ పార్టీకి సెల్ఫ్ గోల్ లాగా కనిపిస్తున్నాయి. ప్రత్యర్థులను తిట్టడానికి చెబుతున్న మాటలు కూడా.. బలంగా లేవు. ప్రత్యర్థులే ఆ మాటలను పట్టుకుని ట్రోల్ చేసేవిధంగా ఉన్నాయి.
జనసేన ఇప్పటిదాకా ఎన్నడూ చట్టసభల్లోకి ప్రవేశించనే లేదని, చట్టసభల్లో ప్రవేశించాలనే ఏకైక లక్ష్యంతోనే ఈసారి ఎన్నికల్లో దిగుతోందని విజయసాయిరెడ్డి అంటున్నారు. ఆయన చెప్పిన మాటలో కొత్త విషయం ఏముంది? గత ఎన్నికల్లో జనసేన తరఫున ఒక ఎమ్మెల్యే గెలిస్తే.. ప్రలోభపెట్టి వైకాపా తమలో కలిపేసుకుంది. చట్టసభల్లో అడుగుపెట్టడానికే పోటీచేస్తున్నట్టుగా పవన్ కల్యాణ్ స్వయంగా చెబుతూనే ఉన్నారు. ప్రజలకోసం సొంతంగానే ఎంతో చేస్తున్న పవన్ కల్యాణ్.. జగన్ వంటి దుర్మార్గుల పాలనను అంతమొందించాలంటే.. చట్టసభల్లో ఉండాల్సిన అవసరం ఉన్నదని, అందుకే తన పార్టీ పోటీచేస్తున్నదని పలుమార్లు చెప్పారు. ఇప్పుడు విజయసాయి మళ్లీ ఈ డైలాగుతో గుర్తు చేయడం.. జగన్ దుర్మార్గాలను పవన్ ఎండగట్టిన వైనాన్ని గుర్తిచేసినట్టే ఉంది.
నెల్లూరులో తెలుగుదేశానికి అభ్యర్థులు లేక తమ పార్టీనుంచి తీసుకున్నదని విజయసాయి అంటున్నారు. ఆ జిల్లాలో తెలుగుదేశం పంచన చేరిన వారు ముగ్గుర వైసీపీ ఎమ్మెల్యేలు అయితే , చంద్రబాబు ఇద్దరికే టికెట్లు ఇచ్చారు. అలాగని జిల్లాలో మిగిలిన సీట్లను గాలికి వదిలేయలేదు కదా? అనేది ప్రజల ప్రశ్న. అది కూడా.. వైసీపీ తరఫున గెలిచినా సరే.. ఆ ప్రభుత్వం మాయమాటలు చెప్పడం తప్ప నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పని అయినా చేయలేకపోతున్నాం అని పాలక పక్షాన్ని ఛీకొట్టి వారు బయటకు వెళ్లిపోయిన తర్వాతనే కదా తెలుగుదేశం చేర్చుకున్నది అని ప్రజలు అంటున్నారు.
ఈ రకంగా విజయసాయి తన మాటలతో ప్రత్యర్థుల్ని విమర్శిస్తున్నారని అనుకుంటున్నారు గానీ.. నిజానికి ఆయన సొంత పార్టీమీదికే సెల్ఫ్ గోల్ వేసినట్లు చేస్తున్నారని అంతా అనుకుంటున్నారు.