ఆదిత్య కాలేజీపై కోర్టుకు వెళ్లనున్న స్టూడెంట్స్!

తమ కాలేజి విద్యార్థులు కూడా గంటకు రెండు వందలు తీసుకుని జై కొట్టడానికి వచ్చే కూలీలు లాంటి వారని, ఆ కాలేజీ యాజమాన్యం అనుకున్నదేమో తెలియదు. తాము చెప్పినట్టుగా కాకుండా మరొక రకంగా జై కొట్టినందుకు వారు ఆగ్రహోదగ్రులయ్యారు. కత్తి దూశారు. వారి మీద సస్పెన్షన్ వేటు వేశారు. యాజమాన్యం జగన్ కు జై కొట్టించడానికి వారిని రోడ్డు మీద నిలబెట్టింది. వారిలో కొందరు తమ ఇష్టపూర్వకంగా పవన్ కళ్యాణ్ కు జై కొట్టారు. కాలేజి అధిపతులు దాన్ని జీర్ణం చేసుకోలేక సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఆ విద్యార్థులు తమ సస్పెన్షన్ పై కోర్టును ఆశ్రయించనున్నట్టుగా తెలుస్తోంది.

జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా తమ కళాశాల ముందునుంచి వెళుతున్నారని తెలిసి కాలేజీ యాజమాన్యం కాస్త ఓవరాక్షన్ చేసింది. విద్యాదీవెన నిధులు ఇస్తున్నందుకు ధన్యవాదాలు చెబుతున్నట్టుగా థాంక్యూ జగన్ అంటూ పెద్ద ఫ్లెక్సి వేయించి స్టూడెంట్స్ దాన్ని పట్టుకుని రోడ్డుపై నిలబడేలా ఏర్పాటుచేశారు. ఎన్నికల సమయంలో స్టూడెంట్స్ ను అలా రాజకీయ పావుల్లాగా వాడడమే కాలేజీ యాజమాన్యం చేసిన పెద్దతప్పు. అలా నిలబెట్టారు.

ఆ ఫ్లెక్సి చూసి.. ఇక్కడేదో మన అభిమానగణం ఉన్నదని మురిసిపోయి.. బస్సు ఆపించి దిగి, కాలేజీ వైస్ చైర్మన్ తో ముచ్చటించారు. పిల్లలతో కూడా మాట్లాడారు. ఈలోగా పిల్లల్లోంచి పవన్ కల్యాణ్ అనుకూల నినాదాలు ఒక్కసారిగా మిన్నంటాయి. అసహనానికి గురైన జగన్ వెంటనే బస్సు ఎక్కి వెళ్లిపోయారు.

ఆ తర్వాత పార్టీ వాళ్లు.. కాలేజీ యాజమాన్యానికి తలంటు పోశారో ఏమో.. వారు ముందూ వెనుకా చూసుకోకుండా, పవన్ అనుకూల నినాదాలు చేసిన అయిదుగురు విద్యార్థుల్ని సస్పెండ్ చేశారు.
 
అయితే ఈ నిర్ణయం ఇప్పుడు కోర్టు వద్దకు వెళ్లబోతోంది. పిల్లలను వస్తువుల్లా అలా నిలబెట్టడమే కాలేజీ చేసిన తప్పు అంటూ.. కోర్టులో చర్చకు వస్తుంది. స్టూడెంట్స్ తమ భావప్రకటన చేయకుండా ఎందుకు ఉండాలని, దానిని అణచివేసే హక్కు కాలేజీ యాజమాన్యానికి లేదని వారు కేసు వేయబోతున్నారు. కేసే గనుక పడిందంటే.. కాలేజీ యాజమాన్యం జగన్ కళ్లలో సంతోషం చూడడానికి విద్యార్థుల్ని ఎలా అడ్డగోలుగా వాడుకున్నదో అంతా చర్చకు వస్తుందని పలువురు విశ్లేషిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories