వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులుగా ప్రకటితమైన వాళ్లందరూ మురిసిపోవడానికి ఇంకా వీల్లేదు. నామినేషన్ల ఉపసంహరణ కూడా పూర్తయ్యేవరకు వారి బతుకులు డైలమాలోనే ఉండేలా కనిపిస్తోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా అభ్యర్థుల మార్పు గురించి కసరత్తు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా మూడు నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒకటిరెండు ఎంపీ నియోజకవర్గంలో అభ్యర్థులను మార్చడానికి ఆలోచిస్తున్నారట. ఎమ్మెల్యే అభ్యర్థిత్వాల మార్పు విషయంలో రకరకాల కారణాలు ఉన్నప్పటికీ.. ఎంపీ అభ్యర్థి మార్పు విషయంలో చెల్లెలు వైఎస్ షర్మిల విమర్శలకు జడుసుకునే ఆ నిర్ణయానికి వచ్చారని అంటున్నారు.
కొత్తగా వినిపిస్తున్న సమాచారాన్ని బట్టి.. కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డిని తప్పించే అవకాశం ఉందని అంటున్నారు. ఆయన స్థానంలో అభిషేక్ రెడ్డిని పోటీకి దించుతారనే ప్రచారం జరుగుతోంది. షర్మిల కాంగ్రెస్ తరఫున ఎంపీ అభ్యర్థిగా బరిలోకిదిగి.. ఊరూరా తిరుగుతూ.. ఏ స్థాయిలో జగన్ వ్యతిరేక ప్రచారం సాగిస్తున్నారో అందరికీ తెలుసు. చిన్నాన్న చంపిన హంతకులను పార్లమెంటుకు పంపుతావా? అంటూ జగన్ ను సూటిగా ప్రశ్నిస్తున్నారు. చిన్నాన్న హంతకులను కాపాడడంలో ఆంతర్యం ఏమిటి? హత్య వెనుక నీ పాత్ర ఎంత? అంటూ జగన్ ను విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు. ఎక్కువగా సర్వేల మీద ఆధారపడే జగన్మోహన్ రెడ్డి, తాజాగా కడపలో చేయించిన సర్వేలో ఓటమి గ్యారంటీ అని తేలినట్టుగా సమాచారం. నియోజకవర్గ ప్రజలు షర్మిలకు అనుకూలంగా మొగ్గుతున్నారని, వైసీపీ నాయకుల్లో కూడా పలువురు లోలోపల ఆమెకు అనుకూలంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయనకు అర్థమైంది. దీంతో అవినాష్ రెడ్డి బరిలో ఉంటే ఓటమి తప్పదని, అదే జరిగితే.. పార్టీ పరువు మాత్రమే కాకుండా, చెల్లెలి చేతిలో పరాజయానికి వ్యక్తిగతంగా తన పరువు కూడా పోతుందని జగన్ భయపడుతున్నారు. అందుకే అవినాష్ ను మారుస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
దీంతో పాటూ గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఉన్న కిలారు రోశయ్యను గుంటూరు వెస్ట్ కుబదిలీ చేసి, అక్కడ అభ్యర్థిగా ఉన్న మంత్రి విడదల రజనిని గుంటూరు ఎంపీగా పోటీచేయిస్తారని కూడా ప్రచారం ఉంది. కిలారు రోశయ్య ఎంపీ స్థానానికి ఖర్చు పెట్టగలిగేంత నిధులు తన వద్ద లేవని చేతులెత్తేసినట్టుగా కొన్ని రోజుల కిందట ప్రచారం జరిగింది. ఇప్పుడు సీటు మార్పు గురించిన ప్రచారం జరగుతోంది. అయితే ఇలాంటి ప్రచారాన్ని రోశయ్య ఖండిస్తున్నారు. గుంటూరు ఎంపీగా తానే బరిలో ఉంటానని అంటున్నారు.
అలాగే మైలవరంలో తెదేపా తరఫున ఉన్న వసంతకృష్ణ ప్రసాద్ ను ఢీకొనేందుకు, పెనమలూరు అభ్యర్థిగా ఉన్న జోగి రమేష్ ను తీసుకువస్తారనే ప్రచారం ఉంది. అలాగే విజయవాడ వెస్ట్ స్థానానికి ఆసిఫ్ ను జగన్ ప్రకటించారు. ఇప్పుడు ఆ స్థానంలో జనసేన నుంచి వచ్చి చేరిన పోతిన మహేష్ కు కట్టబెడతారని ప్రచారం జరుగుతోంది. పోతిన మహేష్ అయితే పవన్ కల్యాణ్ ను తిట్టడానికి బాగా ఉపయోగపడతారని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
మరి ఈ సరికొత్త మార్పు చేర్పుల గురించిన సమాచారం ఎప్పుడు అధికారికంగా వెల్లడవుతుందో, వైసీపీకి ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో చూడాలి.