ఆయన డూడూ బసవన్న లాగా తాము చెప్పిన దానికెల్లా తలాడిస్తూఉండే వ్యక్తి కాదు. చట్టానికి లోబడి నిర్ణయాలు తీసుకునే వ్యక్తి. అందుకే వారు ఆయనను లూప్ లైన్లో పెట్టారు. కానీ, వారికి తెలియని సంగతి ఏంటంటే.. హిందీలో ఒక సామెత ఉంటుంది… ‘హీరా హై తో చమకేగీ’ అని! అంటే ‘అది వజ్రం అయితే గనుక.. మట్టిలో దుమ్ములో పడేసి ఉన్నా కూడా ఏదో ఒక నాటికి మెరుస్తుంది’ అని అర్థం! ఇప్పుడు అదే జరిగింది!! లూప్ లైన్లో పెట్టిన వారి ప్రభుత్వమే కుప్పకూలిపోయింది. నిజాయితీకి పట్టం కట్టే చంద్రబాబునాయుడు.. సీనియర్ ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్న సీహెచ్ ద్వారకా తిరుమల రావును.. రాష్ట్ర నూతన డీజీపీగా నియమించారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. తన ఆదేశాలకు ఎదురు చెప్పకుండా, ఏం చెబితే అది చేసుకుంటూ పోయే వారిని మాత్రమే.. కీలకపదవుల్లో నియమిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో భాగంగానే సీనియారిటీలో ముందున్న వారిని ఇతర అప్రాధాన్య పోస్టుల్లోకి పంపి.. తనకు కావాల్సిన వారిని తెచ్చి నెత్తిన పెట్టుకున్నారు.
గౌతం సవాంగ్ తొలుత డీజీపీగా ఉండగా.. అధికార పార్టీ కార్యకర్తగానే పనిచేశారనే అపకీర్తిని మూటగట్టుకున్నారు. పోలీసుదళాలు మొత్తం రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ వారి విధేయవర్గాలుగా మారిపోయాయి. సవాంగ్ ఎంతగా ప్రభుభక్తిని ప్రదర్శించినప్పటికీ.. ఒక దశలో జగన్ కు ఆయన మీద ఆగ్రహం వచ్చింది. ఉద్యోగుల చలో విజయవాడ ఉద్యమాన్ని ముందుగానే పసిగట్టి అణచివేయడంలో విఫలం అయ్యారని ఆగ్రహించి.. సవాంగ్ ను హఠాత్తుగా తప్పించి.. ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా కూర్చోబెట్టారు. చాలామంది కంటె జూనియర్ అయిన, తనసామాజిక వర్గానికే చెందిన రాజేంద్రనాధ్ రెడ్డిని డీజీపీ స్థానంలోకి తీసుకువచ్చారు.
రాజేంద్రనాధరెడ్డి , జగన్ పట్ల ఏ రకంగా ప్రభుభక్తిని ప్రదర్శించారో అందరికీ తెలుసు. రాజకీయ ప్రత్యర్థుల మీద పోలీసుదళాలు మొత్తం పగబట్టినట్టుగా వ్యవహరించాయంటే డీజీపీనే కారణం. ఆయన పదవీకాలంలో ఉండగా.. తెలుగుదేశం నాయకులకు ఒక్కసారైనా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆయన అరాచకపోకడలు శృతిమించడంతో ఎన్నికల సంఘం, ఎన్నికల సమయంలో ఆయనను పక్కకు తప్పించి హరీష్ కుమార్ గుప్తా ను ఆ స్థానంలో నియమించింది.
చంద్రబాబునాయుడు ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత.. జగన్ అప్పట్లో లూప్ లైన్లో ఆర్టీసీ ఎండీ బాధ్యతల్లో నియమించిన ద్వారకా తిరుమల రావును డీజీపీగా చేసింది. ఇందుకోసం ఎలాంటి అడ్డదారులు తొక్కలేదు. ప్రస్తుతం ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నది ద్వారకా తిరుమల రావే కావడం గమనార్హం. అర్హుడైన నిజాయితీ గల అధికారినే అత్యున్నత పదవిలోకి తీసుకువచ్చింది చంద్రబాబు ప్రభుత్వం!