జగన్ పై రాయి : అదుపులో నలుగురు!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద రాయి విసిరిన ఆకతాయి ఎవరు అనేది ఇప్పుడు పోలీసులు తేల్చాల్సి ఉంది. పోలీసులు ఇప్పటికే నలుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒక్కరోజులోనే నలుగురు అనుమానితుల్ని పట్టుకోగలిగారంటే గొప్పవిషయమే. వీరిలో ఎవరో ఒకరు నేరాన్ని అంగీకరించే అవకాశం కూడా ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. నిందితుడిగా పోలీసులు ఏవ్యక్తినైతే ప్రజల ఎదుట నిల్చోబెడతారో.. అతను అసలు నిందితుడేనా, లేదా బలవంతం మీద నేరాన్ని నెత్తిన వేసుకున్న వ్యక్తి అయి ఉండవచ్చా అనే అనుమానాలు కూడా ప్రజల్లో వినిపిస్తున్నాయి.

నిజానికి జగన్మోహన్ రెడ్డి మీద రాయి విసిరిన వ్యక్తిని కనిపెట్టడం అనేది క్లిష్టమైన సమస్యగానేమారింది. ఎందుకంటే.. ఆ సమయంలో అక్కడ కరెంటు లేదు. గాఢాంధకారం. జగన్ బస్సు ఆగిఉన్న ప్రదేశానికి ఒకవైపు స్కూలు ఉంది. దట్టమైన చెట్లు కూడా ఉన్నాయి. అక్కడెక్కినుంచైనా ఆకతాయి రాసి విసిరి ఉండవచ్చుననేది పోలీసుల అంచనా. అయితే ఆ ప్రదేశం నుంచి రాయివిసిరిన తర్వాత పారిపోవడం కూడా చాలా సులువు అని పోలీసులు చెబుతున్నారు. అదే సమయంలో.. ఆ వీధిమొత్తానికి రెండే సీసీ టీవీ ఫుటేజీలు వారికి లభ్యమయ్యాయి. వాటిద్వారా నిందితుడి గురించి ఎంత మేర ఖచ్చితమైన ఆచూకీ తెలుస్తుందో తేల్చచెప్పలేం. సెల్ ఫోన్ టవర్ నుంచి కూడా అధికారులు డంప్ తీసుకున్నారు. ఒక నెంబరును ఎక్కువ సంఖ్యలో కాల్స్ వెళ్లి ఉంటే అలాంటివారిని అనుమానించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ శాస్త్రీయమైన దర్యాప్తు పద్ధతులు. కొన్ని వందల గంటల సీసీటీవీ ఫుటేజీలను, కొన్ని వేల నెంబర్ల ద్వారా జరిగిన ఫోను కాల్స్ ను ట్రేస్ చేయడం అనేది ఒక పట్టాన జరిగే పనికాదు. వ్యవధి తీసుకుంటుంది.

ఇదంతా ఇలా ఉండగా.. పోలీసులు అప్పుడే నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారించడం గొప్ప విషయమే. ఈ నిందితుల్లో ఎవరైనా జగన్ ను చంపడానికే రాయి విసిరాం అని చెప్పినా, సదరు నిందితుడికి గతంలో తెలుగుదేశం పార్టీతో అనుబంధం ఉన్నదని గానీ, లేదా, తెలుగుదేశం నాయకుల పురమాయింపు మీదనే అలా చేశాడని తేల్చినా గానీ.. మళ్లీ పెద్ద రాజకీయ రగడ ప్రారంభం అవుతుంది. పోలీసులు నకిలీ నిందితుల్ని ప్రజల ఎదుట చూపించి.. తెలుగుదేశం మీద బురద పులమడానికి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వస్తాయి. కాబట్టి తెలుగుదేశానికి చెందిన వ్యక్తి నిందితుడిని తేలినా సరే.. ఆ విషయం చెప్పే ముందు పోలీసులు చాలా పక్కాగా ఆధారాలన్నీ సేకరించాలి. అతనితో ఆ పని ఎవరు చేయించారనే సంగతి కూడా పక్కాగా నిరూపించగలగాలి. లేకపోతే గాలివాటుగా నిందితుడిని తేల్చేస్తే.. రాష్ట్రంలో పెద్ద రాజకీయ దుమారం రేగే అవకాశం ఉందని ప్రజలు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories