రాష్ట్రప్రజలు తనను కేవలం ఒక సాధారణ ఎమ్మెల్యేగా మాత్రమే అయిదేళ్లు పాటు జీవించాల్సిందిగా విస్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ.. తనను తాను ముఖ్యమంత్రికి సమానమైన నాయకుడిగా భావించుకుంటూ అలాంటి మర్యాదలను కోరుకునే మనఃస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. అలాంటిది.. ఆయనకు అంతో ఇంతో ఉన్న హోదాలు, మర్యాదలు కూడా కూడా మంటగలిసిపోతే ఆయన తట్టుకోగలరా? తట్టుకోక చేయగలిగింది ఏమీ లేదు. పైగా పదవి పోగానే అవమానకరమైన అనుభవాలు జగన్మోహన్ రెడ్డికి ఎదురవుతున్నాయి.
వైఎస్ జగన్ ఈనెల 3వ తేదీనుంచి 25వ తేదీ వరకు యూకే పర్యటనకు వెళ్లడానికి.. తన అవినీతి కేసులు విచారిస్తున్న సీబీఐ కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. ఆయనకు గానీ, విజయసాయిరెడ్డికి గానీ.. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వనే వద్దంటూ సీబీఐ గట్టిగానే వాదించింది గానీ.. మొత్తానికి జగన్ అనుమతిలభించింది. ఆయన ఎంచక్కా కూతుళ్ల వద్దకు సకుటుంబంగా యాత్ర ప్లాన్ చేసుకుంటున్న సమయంలో.. పాపం వరదలు వచ్చాయి. ప్రయాణం కాస్త వరదల కారణంగా వాయిదా పడింది. ఈలోగా అసలు ట్విస్టు ఏంటంటే.. ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన స్థాయికి తగ్గట్టుగా ఇచ్చిన డిప్లమాట్ పాస్ పోర్టు కూడా రద్దు అయిపోయింది. కేవలం ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా జడ్ ప్లస్ భద్రత కొనసాగిస్తూ ఉంటే.. కాదు కాదు నాకు సీఎం స్థాయి భద్రత కావాలని బిగదీసుకుని కోర్టులో కేసు వేసిన జగన్మోహన్ రెడ్డికి ఇది చాలా చాలా పెద్ద షాక్.
కూతురు దగ్గరకు వెళ్లాలంటే వేరే మార్గం లేదు గనుక ఆయన సాధారణ పాస్ పోర్టు కోసం అప్లయి చేసుకున్నారు. ఐదేళ్లకు ఆయనకు జనరల్ పాస్ పోర్టు ఇవ్వచ్చునని సీబీఐ కోర్టు ఆదేశించింది. అయితే విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో జగన్ మీద కేసు పెండింగులో ఉన్నందువల్ల, అక్కడ కూడా ఎన్ఓసీ కోసం జగన్ దరఖాస్తు చేశారు. పాపం ఒక్క ఏడాదికే పాస్ పోర్టు ఇవ్వాలని ఆ కోర్టు పేర్కొన్నది. అలా కుదర్దు.. తనకు అయిదేళ్లు పాస్ పోర్టు కావాలంటూ జగన్ హైకోర్టుకు వెళ్లారు. ఆ పిటిషన్ సోమవారానికి వాయిదా పడింది. దీంతో జగన్ లండన్ ప్రయాణం మళ్లీ వాయిదా పడింది.
ఓడిపోయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి హోదా భద్రత కోరుకుంటున్న జగన్, చివరికి ఈ దేశంలో సాధారణ పౌరుల్లాగా పాస్ పోర్టు కూడా పొందలేక, ఒక్క ఏడాదికే పాస్ పోర్టు పొందే కేసులున్న నిందితుడి హోదాను మాత్రం పూర్తి స్థాయిలో అనుభవిస్తున్నారు.