వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సోషల్ మీడియాలో చెలరేగుతూ ప్రత్యర్థి పార్టీలకు చెందిన కీలక నాయకులను, వారి కుటుంబ సభ్యులను పచ్చి బూతులతో అసభ్యమైన భాషతో నీచంగా విమర్శిస్తూ ఉండే వారిలో శ్రీరెడ్డి కూడా ఒకరు. అలాంటి నీచత్వం ద్వారా మాత్రమే ఒకే భావజాలానికి చెందిన సమూహంలో సెలబ్రిటీ హోదాను సంతరించుకున్న వారిలో ఆమె ప్రముఖులు. తనను తాను సినిమా నటిగా అభివర్ణించుకునే ఆమె బూతు మాటలతో విమర్శలు చేయడంతోనే ఎక్కువ పాపులర్ అయ్యారంటే అతిశయోక్తి కాదు! ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తల మీద పోలీసులు కేసులు నమోదు చేస్తూ, హద్దు దాటి పోస్టులు పెడుతున్న వారి మీద చర్యలు తీసుకుంటూ.. వారి అసహ్యకరమైన దుష్ప్రచారాలను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో శ్రీ రెడ్డి కూడా మీడియా ముందుకు వచ్చారు!
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, హోం మంత్రి వంగలపూడి అనిత లకు ఆమె పేరుపేరునా సారీ కూడా చెప్పారు. తన సోషల్ మీడియా ఖాతాలో ఇకమీదట వారి గురించి, వారి కుటుంబ సభ్యుల గురించి అసభ్యమైన పోస్టులు పెట్టను అని వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఎప్పటికీ జగనన్న వెంట ఉంటానని కూడా ఆమె తేల్చి చెప్పారు. అయితే మొత్తంగా చిన్నవారైన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను క్షమించి వదిలేయాలని, యుద్ధం జరుగుతున్నప్పుడు పెద్ద నేతలతో మాత్రమే- అధికారంలో ఉన్నవారు తలపడాలని శ్రీరెడ్డి ప్రభుత్వానికి హితోపదేశం కూడా చేశారు. అయితే ఆమె వీడియోను జాగ్రత్తగా గమనించినప్పుడు- శ్రీరెడ్డి లోని గోరోజనం ఏమాత్రం తగ్గలేదని, ఆమె బుద్ధులు ఏమాత్రం మారలేదని అర్థం అవుతోంది!
ముందు ముందు శ్రీరెడ్డి మీద కూడా కేసులు నమోదు అయ్యే, ఆమె కూడా అరెస్టు అయ్యే అవకాశం ఉన్నందున.. ఒక అతి ముందు జాగ్రత్తగా ఇలాంటి వీడియో విడుదల చేసినట్లుగా కనిపిస్తోంది. సారీ చెప్పినా కూడా, క్షమించమని అడిగినా కూడా తన మీద కేసులు పెట్టారు- అని రాద్ధాంతం చేయడానికి తప్ప ఈ వీడియోలో నిజమైన పశ్చాత్తాపం ఇసుమంతైనా కనిపించడం లేదు- అని ఈ వీడియో చూసిన వారికి ఎవరికైనా ఇట్టే అర్థమయిపోతుంది! చెన్నైలో స్థిరపడిన శ్రీరెడ్డి ‘సారీ’ కోసం విడుదల చేసిన వీడియోలో తన గోరోజనం మొత్తం యధావిధిగా ప్రదర్శించారు. ప్రభుత్వం తీరుని ఆమె తప్పు పట్టారు. మీకు అధికారం ఇచ్చింది ఇందుకు కాదు కదా.. హత్యలను ఆపండి.. దుర్మార్గాలను ఆపండి.. సోషల్ మీడియా వారి మీద కేసులు పెట్టడం కాదు అంటూ సవాళ్లు విసిరారు. మీకు కుటుంబాలు ఉన్నట్లే సోషల్ మీడియా కార్యకర్తలకు కూడా కుటుంబాలు ఉంటాయి అని మొసలి కన్నీరు కార్చారు. వాళ్ళని అరెస్టు చేసి మీరేం సాధిస్తారు వాళ్ళతో సారి చెప్పించుకుంటారు అంతే కదా.. అంతకుమించి మీరు చేసేదేముంది అంటూ సవాళ్లు విసురుతూనే కాస్త మృదువుగా మాట్లాడారు.
బహుశా సోషల్ మీడియా అసహ్యకరమైన కార్యకర్తల మీద కేసులు, అరెస్టులు మొదలుకావడానికి ముందు శ్రీరెడ్డి ఇదే వీడియో విడుదల చేసి ఉంటే కనుక.. భాషలో, అసభ్య పదజాలంలో ఏమైనా కొద్దిగా మార్పు ఉండేది తప్ప కంటెంట్ లో ఆమె బుద్ధిలో ఏమాత్రం మార్పు రాలేదని ఈ వీడియో చూస్తే తెలిసిపోతుంది. ఇప్పటికీ ప్రభుత్వాన్ని నిందించడం వారు చేస్తున్నది తప్పు అని చెప్పడం, మీ పనులను బట్టి మాత్రమే సోషల్ మీడియా వాళ్ళు పోస్ట్లు పెడుతున్నారు అని చెప్పడం ఇత్యాది మాటలతో 90 శాతం వీడియోను ప్రభుత్వాన్ని నిందించడానికి వెచ్చించిన శ్రీరెడ్డి… 10 శాతం వీడియోలో ఏదో నాయకులకు ముష్టి వేసినట్టుగా సారీలు చెప్పేసి తాను సేఫ్ జోన్ లో ఉండాలని కోరుకుంటూ ఉండడం విచిత్రంగా కనిపిస్తోంది.