ఏపీకి స్పెషల్ స్టేటస్ : కండిషన్స్ చెప్పండి ముందు!

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఊరించే ఒక హామీని కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో ప్రకటించింది. దేశవ్యాప్తంగా అనేక వర్గాలను ఆకర్షించేలా సమ్మోహక అస్త్రాలను గుదిగుచ్చి తమ మేనిఫెస్టోను కాంగ్రెస్ తయారుచేసింది. దేశంలోని ప్రతి పేద మహిళకు ఏడాది లక్షరూపాయలు ఉచితంగా ఇవ్వడం, స్టడీలోన్ లను పూర్తిగా రద్దుచేసి ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లించేయడం, యువతకు ఏడాది పాటు అప్రెంటిస్ షిప్ విధిగా కల్పించడం- అందుకు రూ.లక్ష వరకు ఖర్చు పెట్టడం వంటి అనేక హామీలు ఇందులో ఉన్నాయి. అదే సమయంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద తిరుగులేని అస్త్రంలాగా.. ప్రత్యేకహోదా ఇస్తాం అనే మాటను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

ఈ పదేళ్లలో కూడా ప్రత్యేకహోదా గురించి రకరకాలుగా కాంగ్రెస్ పార్టీ ఏపీ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తూనే వచ్చింది. ఏపీకి ప్రత్యేకహోదా అనేది కాంగ్రెసు ద్వారా మాత్రమే సాధ్యం అని, మేం పదేళ్లు హోదా ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం అని.. రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. అయినా కాంగ్రెస్ మాటలను ఏపీ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. తీరా ఇప్పుడు ఎన్నికలు ముంచుకువచ్చిన తరువాత.. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సారథిగా ఉండడం మాత్రమే కాకుండా, కడపలో అవినాష్ రెడ్డిని ఓడించే  కృతనిశ్చయంతో ఎన్నికలబరిలో తలపడుతున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ మళ్లీ ఏపీ మీద సీరియస్ గానే ఫోకస్ పెడుతున్నది. ఈసారి ఏపీకి ప్రత్యేకహోదా అనే అంశాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టింది.

అయినా సరే.. ప్రజలకు మాత్రం కొన్ని సందేహాలు కలుగుతున్నాయి. అవి యివీ..

1) కేంద్రంలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉండే ప్రభుత్వం ఏర్పడితే చాలు.. ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నారా లేదా? అలాకాకుండా, కాంగ్రెస్ కు పూర్తి మెజారిటీ వచ్చి ప్రభుత్వం ఏర్పడితేమాత్రమే ఇవ్వగలం, సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి పార్టీలు ఒప్పుకోకపోతే ఏం చేయలేం.. అని మడత పేచీలు పెడతారా?

2) ఏపీకి ప్రత్యేకహోదాతో పాటు, మేనిఫెస్టోలో తాము ఇచ్చిన అన్ని హామీలను అమలుచేసేట్లయితే మాత్రమే.. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి వస్తే అందులో తాము భాగస్వామి అవుతాం అని.. లేకపోతే.. ఆ ప్రభుత్వంలో చేరనే చేరమని ఇప్పుడే స్పష్టం చేయగలరా?


3) కేంద్రంలో కాంగ్రెస్ సంకీర్ణం రావడం మాత్రమే కాదు, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితేనే ప్రత్యేకహోదా ఇస్తాం అని మడత పేచీ పెట్టకుండా ఉంటారా?


4) గెలిచిన తర్వాత ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఏయే కండిషన్స్ అప్లయి అవుతాయో.. ఇప్పుడే చెప్పగలరా? లేదా, బేషరత్తుగా ఇచ్చేస్తాం అనే మాట అనగలరా?

అని ప్రజలు అడుగుతున్నారు. ప్రత్యేకహోదా అనే మాటతోనే ఏపీ ప్రజలను బురిడీ కొట్టించడం సాధ్యం కాదని, ఆచరణాత్మకంగా తాము ఎలా ఇవ్వగలరో చెప్పి నమ్మించాలని ప్రజలు అనుకుంటున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories