తిరుమల వెంకటేశ్వర స్వామి వారి సేవలో ఉంటూ ఆయనను అడ్డుపెట్టుకుని దందాలు చేయడానికి సాధారణంగా ఎవరైనా భయపడతారు. కానీ వెంకటేశ్వరుని సేవలో ఉంటూ విపరీతంగా అవినీతికి, అక్రమార్జనులక పాల్పడడం మాత్రమే కాదు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దళారీ లాగా వ్యవహరిస్తూ వారికి నిధులు పోగేయడానికి కూడా దేవుడిని వాడుకున్నటువంటి దుర్మార్గాల మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. తిరుమల తిరుపతి దేవస్థానాల కార్యనిర్వహణాధికారి పదవిలో ఉంటూ ధర్మారెడ్డి సాగించిన దందాల మీద విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. కేంద్ర సర్వీసు నుంచి వచ్చి తిరుమల వెంకటేశ్వరుని బాధ్యతలు చూస్తూ భక్తి విధేయతలను మాత్రం జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రకటిస్తూ విచ్చలవిడిగా చెలరేగిన ధర్మారెడ్డి అరాచకాలు అన్ని ఇప్పుడు వెలుగులోకి రాబోతున్నాయి.
తిరుమల కార్య నిర్వహణాధికారిగా ఉంటూ విఐపి భక్తులకు ప్రత్యేక సేవలు ఏర్పాటు చేసి వారి ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విరాళాలు ఇప్పించారనేది ధర్మారెడ్డి మీద ఉన్న కీలక ఆరోపణ. అలాగే శ్రీవాణి ట్రస్టు ముసుగులో వచ్చిన విరాళాల ఖర్చు విషయంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలోనే ఆరోపణలు వెల్లువెత్తినప్పటికీ.. వాటన్నింటికీ డొంక తిరుగుడు సమాధానాలు ఇస్తూ ధర్మారెడ్డి రోజులు నెట్టుకొచ్చారు. ఆయన జగన్ భక్తుడే కనుక ప్రభుత్వం కూడా ఈ అరాచకాలను పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దృష్టి సారిస్తున్నారు. ధర్మారెడ్డి అక్రమాలు లెక్క తేలితే భారీ శిక్షలు పడే అవకాశం ఉన్నదని కూడా అంటున్నారు.
తాజా పరిణామాలలో ధర్మారెడ్డి తో పాటు సమాచార శాఖ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి పైన కూడా విజిలెన్స్ విచారణకు కూటమి ప్రభుత్వం ఆదేశించింది. పత్రికలకు ప్రకటనలు విడుదల చేయడంలో విజయ్ కుమార్ రెడ్డి అక్రమాలకు పాల్పడుతూ అడ్డగోలుగా సంపాదించారనేది ఆయన మీద ఉన్న ఆరోపణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి భజన చేసేలా మీడియాను ప్రభావితం చేస్తూ వారికి ప్రకటనలు ఎరవేసి స్వామి సేవ చేసుకున్నట్లుగా ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ కాలక్రమంలో విజిలెన్స్ విచారణలో తేలవలసి ఉంది.