విశాఖలోని ఋషికొండను పూర్తిగా గుండు కొట్టించేసి అత్యంత విలాసవంతమైన భవనాలను నిర్మించడం కేవలం జగన్మోహన్ రెడ్డి నివాసం కోసం మాత్రమే.. అనే సంగతి ప్రజలందరికీ అర్థమైంది! విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధాని చేస్తానని ప్రకటించిన జగన్ మోహన్ రెడ్డి ఋషికొండను బోడి కొట్టించి అక్కడ తన కోసం ఒక ప్యాలెస్ నిర్మించడం మినహా ఆ ఊరికి మరేం చేయలేదు. అందుకే యావత్తు ఉత్తరాంధ్ర అత్యంత దారుణంగా జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించింది. ఇంతా కలిపి రుషికొండలో నిర్మించిన ప్యాలెస్ ను జగన్ కనీసం అనుభవించగలిగారా అంటే అది కూడా లేదు. దాదాపు 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తగలేసి టూరిజం ప్రాజెక్టు ముసుగులో తన నివాస భవనాలను నిర్మించుకున్న జగన్మోహన్ రెడ్డి- తన పదవీకాలంలో వాటికి ప్రారంభోత్సవం మాత్రం చేశారు. కనీసం ఒక్క రాత్రి కూడా ఆ ప్యాలెస్ లో బస చేయడానికి కుదరలేదు.
ఇంకా లోతుగా చెప్పాలంటే ఇప్పుడే బయటపడిన రహస్యం మరొకటి ఉంది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం గానూ, నివాసం గాను వినియోగించుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఒక జీవో కూడా తెచ్చారు. గత ఏడాది నవంబర్ 22వ తేదీన జీవో ఆర్ టి 2282 లో ఈ విషయాన్ని పేర్కొన్నారు. జగన్ సర్కారు తన పరిపాలన కాలంలో తీసుకువచ్చిన అనేక అనేక రహస్య జీఓలలో ఋషికొండ ప్యాలెస్ ముఖ్యమంత్రి నివాసమే అని చెప్పే ఈ జీవో కూడా ఒకటి! అందులో ఇంచుమించుగా ఒకటిన్నర లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం ఉంటుందని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి అక్కడితో ఆగలేదు. ఆ భవనంలో ఫర్నిచర్ ఏర్పాటు కోసం డిసెంబరులో మరొక జీవో కూడా తీసుకువచ్చారు. ఈ విషయాలన్నీ ఇప్పుడే వెలుగు చూశాయి!
చాలా సుదీర్ఘకాలం శోధించిన తర్వాత ఈ జీవోలు తనకు దొరికినట్టుగా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జరిగిన బిఎసి మీటింగులో చంద్రబాబు నాయుడుకు విష్ణుకుమార్ రాజు ఈ విషయం తెలియజేశారు. ఆయన చెప్పే వరకు ఋషికొండ ప్యాలెస్ ను సీఎం నివాసం కోసం కేటాయించారనే సంగతి చంద్రబాబుకు కూడా తెలియకపోవడం గమనార్హం. అంత గోప్యంగా జగన్ జీవో తీసుకువచ్చారని అర్థమవుతోంది. పాపం ఆయన అత్యంత విలాసవంతమైన భవనాన్ని అనుభవించడానికి ప్రభుత్వ సొమ్మును తగలేసి జీవో కూడా తీసుకువచ్చారు గాని అందులో నివసించే ప్రాప్తం మాత్రం ఆయనకు లేకుండా పోయిందని ప్రజలు నవ్వుకుంటున్నారు!