వెనకటికి ఒక ప్రబుద్ధుడు చెరువు మీద అలిగి స్నానం చేయడం మానేశాడని సామెత! ప్రస్తుతం ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. పంచాయతీ వార్డు మెంబరుగా గెలిచిన అనుభవం కూడా లేకపోయినప్నటికీ, కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీకి రాష్ట్రంలో రాష్ట్ర సారథిగా పనిచేసిన సీనియర్ నాయకుడు ఆయన. తాను అడిగిన సీట్లు పార్టీ ఇవ్వలేదని, వారు ఇచ్చిన సీటును తీసుకోకుండా తిరస్కరించారు. అలకపాన్పు ఎక్కారు. ఆయన సొంత స్థలం రాజమండ్రిలోనే పార్టీ ఎన్నికల వ్యూహరచన సమావేశం జరుగుతుండగా.. ఢిల్లీనుంచి హాజరైన పెద్దలతో పాటు కీలక నాయకులు ఎందరో హాజరు అయినప్పటికీ.. సోము వీర్రాజు మాత్రం డుమ్మా కొట్టారు.
ఎక్కడెక్కడినుంచో తన పార్టీ నాయకులు తన ఊరికి వచ్చి, కీలకమైన సమావేశం నిర్వహిస్తోంటే.. దానికి ఆయన డుమ్మాకొట్టడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఈ ఎన్నికల అభ్యర్థుల్లో తనకు స్థానం దక్కకపోవడం వల్లనే ఆయన అసంతృప్తితో పార్టీ కార్యకలాపాలకు దూరం ఉన్నట్టుగా తెలుస్తోంది.
పొత్తుల్లో భారతీయ జనతా పార్టీ ఆరు ఎంపీ, పది ఎమ్మెల్యే స్థానాలను తీసుకుంది. అయతే సోము వీర్రాజు తొలుత రాజమండ్రి ఎంపీ సీటును ఆశించారు. అనేక తర్జన భర్జనల తర్వాత.. పార్టీ ప్రస్తుత సారథి దగ్గుబాటి పురందేశ్వరి పోటీచేయడానికి రాజమండ్రి సరైన నియోజకవర్గం అని వారు భావించారు. దాంతో ఆయనకు ఎంపీ సీటు దక్కలేదు. భాజపాకు దక్కిన సీట్లలో అనపర్తి ఎమ్మెల్యే స్థానం కూడా ఉండడంతో.. పార్టీ సోము వీర్రాజుకు దానిని ఆఫర్ చేసింది. అయితే భాజపా అక్కడ అంత బలంగా లేదనే ఉద్దేశంతో ఆ స్థానంలో పోటీచేయడానికి సోము సుముఖత చూపించలేదు.
దానికి బదులుగా రాజమండ్రి అర్బన్ లేదా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే స్థానాల్లో ఒకటి కావాలని ఆయన పట్టుబట్టారు. అయితే ఆ రెండూ కూడా తెలుగుదేశానికి సిటింగ్ స్థానాలు కావడంతో వాటిని ఇవ్వడానికి ఆపార్టీ ససేమిరా అంది. కోరుకున్న ఎంపీ సీటు ముందే జారిపోయింది. కోరుకున్న ఎమ్మెల్యే సీట్లు కూడా దక్కకపోయేసరికి ఆయన షాక్ తిన్నారు. దాంతో అలిగి పార్టీ మీటింగుకు కూడా రాలేదు.
అయినా.. సోము వీర్రాజు వంటి సీనియర్ నాయకులు పరిస్థితులకు సర్దుకుపోకుండా ఇలా భీష్మించుకోవడం చిల్లరగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అదేసమయంలో.. ఆయన తెలుగుదేశం యొక్క సిటింగ్ ఎమ్మెల్యే స్థానాలను ఆశించడం కూడా చాలా చిల్లరగా ఉన్నదని పలువురు అంటున్నారు.