అనగనగా ఒక విద్యార్థి ఉన్నాడు. బడిలో టీచరు శివాలయం గురించి వ్యాసం చెప్పమని అడిగాడు. కుర్రాడేమీ తడుముకోలేదు. ‘శివాలయంలో నంది ఉండును. నంది అనగా ఎద్దు. అది ఆవునుండి పుట్టును. ఆవుకు నాలుగు కాళ్లు ఉండును. రెండు చెవులు, రెండు కొమ్ములు ఉండును. ఆవు పాలు ఇచ్చును. పాలు ఆరోగ్యానికి మంచిది..’ అంటూ వ్యాసం అప్పజెప్పాడు. టీచరుకు చిరాకేసి.. విమానం గురించి చెప్పమని అడిగాడు. కుర్రాడు ఈసారి కూడా తడుముకోలేదు. ‘విమానం గాలిలో ఎగురును. విమానం కిటికీలోంచి చూసినప్పుడు కింద పచ్చిక బయళ్లు కనిపించును. పచ్చిక బయళ్లలో ఆవు మేయుచుండును. ఆవుకు నాలుగుకాళ్లు ఉండును. రెండు చెవులు, రెండు కొమ్ములు ఉండును. ఆవు పాలు ఇచ్చును. పాలు ఆరోగ్యానికి మంచిది..’ అంటూ తాను నేర్చుకున్న ఒకే వ్యాసాన్ని మళ్లీ అప్పజెప్పాడు. ఇంతకూ విషయం ఏంటంటే.. ఆ విద్యార్థికి ఆవువ్యాసం తప్ప మరేమీ తెలియదు. వాడు అదొక్కటే నేర్చుకున్నాడు. టీచరు ఏ ప్రశ్న అడిగినా సరే.. వాడు ఆ టాపిక్ ను ఆవు దగ్గరకు తీసుకొచ్చి ఆవు వ్యాసమే అప్పజెప్పేవాడన్నమాట.
ఇప్పుడు రాజకీయాల్లో గమనిస్తే.. కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ఎంపీ ఉండవిల్లి అరుణ్ కుమార్ మాటలు అలాగే ఉన్నాయి. అప్పుడెప్పుడో ఇరవయ్యేళ్ల కిందట ఉండవిల్లి అరుణ్ కుమార్ ను మంత్రించిన అస్త్రంలాగా.. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈనాడు పత్రిక మీదికి సంధించారు. ఆయన ‘ఈనాడు-మార్గదర్శి’ అనే టాపిక్ ను బాగా కంఠస్థం చేశారు. ప్రపంచంలో ఏం జరిగినా సరే.. దానిని ఈనాడుకు ముడిపెట్టి మాట్లాడడం ఉండవిల్లి అరుణ్ కుమార్ కు పెద్ద అలవాటు అయిపోయింది.
అప్పట్లో రామోజీరావును బద్నాం చేయడానికి రాజశేఖర రెడ్డి ప్రయోగించిన అస్త్రం ఉండవిల్లి. రామోజీరావు మరణించినా సరే.. ఆయన ఈనాడుకు ముడిపెట్టే బుద్ధిని ఆయన మార్చుకోవడం లేదు. నవీన్ జిందాల్ నుంచి భారీగా సొమ్ములు తీసుకుని.. ఆయన మీద కాదంబరి జత్వానీ ముంబాయిలో పెట్టిన కేసును విత్ డ్రా చేయించడానికి వైసీపీ పెద్దలు కుట్ర చేశారన్నది ఆరోపణ. వైసీపీ ముఖ్యనేతల కళ్లలో ఆనందం చూడడం కోసం అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు మొత్తం గ్రంథం నడిపించారు. అప్పటికీ డీఐజీ ప్రమోషన్ పొందిన విశాల్ గున్నీని.. నీ ఆర్డర్ తొక్కిపెడతానంటూ బెదిరించారు. ముంబాయి పంపి.. కాదంబరి జత్వానీని కుటుంబం సహా అరెస్టు చేసి రప్పించారు.
ప్రెవేటు స్థలంలో నిర్బంధించి వేధించారు. రకరకాల అరాచకాలు చేశారు. ఆయన ఈ కేసులో అరెస్టు అయిన తర్వాత.. ఏపీపీఎస్సీ కార్యదర్శిగా గ్రూప్ 1 మూల్యాంకనంలో చేసిన అక్రమాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. మరో కేసు కూడా నమోదు అయింది. ఆయన చేసిన పాపాలు ఆయనను వెన్నాడుతుండగా.. ఉండవిల్లి మాత్రం.. ఈనాడు మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈనాడుకు పీఎస్సార్ మీద కక్ష ఉండవచ్చునని, వారు వార్తలు రాస్తున్నట్టుగానే.. పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. మొత్తానికి ప్రతి వ్యవహారాన్నీ ఈనాడుకు ముడిపెట్టడం తప్ప.. తనకు మరో సంగతి తెలియదని ఉండవిల్లి చాటుకుంటున్నట్టుగా ఉంది.