పాపం.. శాసనమండలిలో తమకు సభ్యుల బలం ఉన్నది గానీ.. ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలో వైఎస్సార్ కాంగ్రెస్ వారికి అర్థమవుతున్నట్టుగా లేదు. కంగారు పడుతున్నారు. ఏదో ఒకటి ప్రభుత్వాన్ని విమర్శించడం వారి లక్ష్యం. మంత్రులు నోరు తెరిస్తే చాలు అడ్డుపడడం వారి లక్ష్యం. అసలే అసెంబ్లీలో నోరెత్తడానికి ఆ పార్టీ తరఫున ఎవ్వరూ రావడం లేదు. అసెంబ్లీ పాత్రను, మండలి పాత్రను రెండింటినీ పోషించమని పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముందుగానే హింట్ ఇచ్చి పంపించారు. అందుకే మండలి సభ్యులు రెట్టింపు ఓవరాక్షన్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ప్రతి మాటకు అడ్డుపడుతున్న నాయకులు.. అర్థం పర్థం లేకుండా ఆందోళనలు చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు.
ఇంతకూ ఏం జరిగిందంటే.. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల గురించి మండలిలో చర్చ వచ్చింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ జగన్ ప్రభుత్వం వైద్య విద్య ముసుగులో ఎన్ని డ్రామాలు నడిపించిందో ఏకరవు పెట్టారు. రాష్ట్రంలో వైద్య విద్యార్థులను మోసం చేసిందని అన్నారు. 17 వైద్య కాలేజీలు ప్రారంభించినట్టుగా డ్రామాలాడుతూ.. ఒక్క కాలేజీలో కూడా పూర్తిగా బోధన సిబ్బందిని ఏర్పాటు చేయడం గానీ, వసతులు ల్యాబ్ సదుపాయాలు గానీ, పరికరాలు గానీ లేకుండా చేశారని ఎత్తిచూపించారు. చివరికి పులివెందుల కాలేజీలో కూడా 43 శాతం బోధన సిబ్బందితో హాస్టళ్లు కూడా లేకుండా దుర్భర పరిస్థితుల్లో నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ మాటల క్రమంలో వంద ఎలుకలను తిన్న పిల్లి హజ్ యాత్రకు వెళ్లినట్టుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు ఉంటున్నాయని సత్యకుమార్ ఎద్దేవా చేశారు.
అంతే వైసీపీ నాయకులు ఆ మాటను పట్టుకున్నారు. హజ్ యాత్ర అంటూ ముస్లిములను అవమానకరంగా మాట్లాడారంటూ నానా గోల చేయడం ప్రారంభించారు. నిజానికి ఆయన కేవలం సామెతను ప్రస్తావించారు. ఆ సామెతలో కూడా.. హజ్ యాత్రను అగౌరవపరిచే మాట ఏమీలేదు. హాజ్ యాత్ర వెళ్లే వాళ్లందరూ దుర్మార్గులు అనే భావం కూడా లేదు. తప్పుడు పనులు చేసిన వారు కూడా పుణ్యం వచ్చేస్తుందని హజ్ యాత్రకు వెళుతుంటారు అనే భావం మాత్రమే ఉంది. అంటే.. దాని అర్థం హజ్ యాత్ర పుణ్యప్రదాయని అని మాత్రమే. అయితే.. ముస్లిములకు అవమానం అంటూ వైసీపీ ఈ మాట పట్టుకుని గోలచేస్తూ తమ అజ్ఞానం చాటుకోవడం విశేషం. ఒకవైము ముస్లిం వర్గానికి చెందిన మంత్రి ఫరూక్ మాట్లాడుతూ సత్యకుమార్ మాటల్లో ముస్లిములకు అగౌరవం ఏమీ లేదని అంటున్నప్పటికీ వైసీపీ గోల మానలేదు. సామెత తెలియనివాళ్లు అంటూ సత్యకుమార్ ఆక్షేపించినా పట్టించుకోలేదు. ‘హజ్ యాత్ర’ అనేది అన్ పార్లమెంటరీ పదం అని వైసీపీ నాయకులు తీర్మానిస్తే గనుక.. తాను ఆ మాటలు ఉపసంహరించుకుంటానంటూ సత్యకుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన తర్వాత వివాదం సద్దుమణిగింది.