తిరుమల తిరుపతి దేవస్థానాల నిర్వహణలో ఎంత నీచంగా అవినీతికి పాల్పడ్డారో ఇప్పుడు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. లడ్డూ ప్రసాదానికి వాడిన నెయ్యిలో ఖచ్చితంగా కల్తీ ఉన్నదనే సంగతి తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వం పెద్దలు మాత్రమే కాదు.. టీటీడీ ఈవో కూడా స్వయంగా ధ్రువీకరిస్తున్నారు. ఒకవైపు వైసీపీ తమకు అంటిన బురద కడుక్కోవడానికి, ఈ విషయంలో లోతుగా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నది. ఇలాంటి నేపథ్యంలో అసలు నెయ్యి కొనుగోలు ధరలు ఖరారుచేసిన వైనం పరిశీలిస్తేనే, వారి తీరు కల్తీని ప్రోత్సహిస్తున్నట్టుగా ఉన్నదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
టీటీడీ రెండు రకాల అవసరాలకోసం నెయ్యిని టెండర్ల ద్వారా కొంటుంది. తిరుమలేశుని ఆలయంలో స్వామివారికి నివేదించడానికి నివేదనలకు వాడే నెయ్యి ఒక రకం కాగా, లడ్డూ తయారీకి వాడే నెయ్యి ఇంకో రకం. నివేదనలకు వాడే నెయ్యిని ఒక కిలో రూ.1667 వంతున కొంటున్నట్టుగా గతంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వయంగా ప్రకటించారు. అయితే లడ్డూ ప్రసాదం కోసం కొంటున్న నెయ్యి ధర ఎంతో తెలుసా? ఒక కిలో కేవలం రూ.320 మాత్రమే! అసలు ఇంత తక్కువ ధరకు నెయ్యి దొరుకుతుందని టీటీడీ వర్గాలు ఏ రకంగా నమ్మి టెండర్లు ఖరారు చేశాయనేదే చిత్రంగా ఉంది. ఒకవైపు స్వామివారి నివేదనలకోసం వాడుతున్న నెయ్యిని దీనికంటె అయిదురెట్లు ఎక్కువ ధరకు వారే కొంటుండగా.. కిలో 320కు లడ్డూల కోసం కొనడం అంటే.. వారే స్వయంగా కల్తీ అయినా పర్లేదు అని సంకేతాలు ఇస్తున్నట్టే కదా.. అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
బహిరంగ మార్కెట్లో నెయ్యి కిలో 600 నుంచి 700 వరకు ఉంటుంది. టీటీడీ వంటి సంస్థ కొనే పరిమాణం చాలా ఎక్కువ కాబట్టి.. ఎవరైనా కాస్త తక్కువ ధరకు టెండరు వేస్తారు. కానీ.. మరీ మార్కెట్ ధరలో సగానికంటె తక్కువ ధరకు ఎలా ఇవ్వగలరు? అనేది కూడా ప్రశ్న! కేవలం తమకు కావాల్సిన వారికి టెండరు కట్టబెట్టుకునే ప్రయత్నంలో ఇంత దారుణంగా ప్రవర్తించారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.
యావత్ హిందూ సమాజంలో వైఎస్సార్ కాంగ్రెస్ పరిపాలన పట్ల ఒకరకమైన అసహ్యభావం పుట్టడానికి ఈ లడ్డూ వివాదం కారణం అవుతోంది.