మిధున్ రెడ్డి అరెస్టుకు సిద్ధమవుతున్న సిట్!

మూడున్నర వేల కోట్లరూపాయల ప్రజాధనం కాజేయడానికి.. అద్భుతమైన వ్యూహరచన చేయడంతో పాటు, దాని అమలు, వసూళ్ల పర్వంలో కీలకపాత్ర పోషించినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్న కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అరెస్టుకు సిద్ధం అవుతున్నారు సిట్ పోలీసులు. ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిలుకోసం మిథున్ రెడ్డి పెట్టుకున్న పిటిషన్ ను  న్యాయస్థానం తిరస్కరించడంతో ఇక అరెస్టు తప్పదని అంతా అంచనా వేస్తున్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో కొత్త లిక్కర్ పాలసీని రూపొందించడం దగ్గరినుంచి ప్రతి దశలోనూ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి కీలక భూమిక పోషించినట్టుగా పోలీసుల న్యాయవాది పేర్కొనడంతో.. కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

తన కుటుంబం మీద ఈ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అనేక రకాల కేసులు పెడుతున్నదని, ఏ ఒక్కటి కూడా వారు నిరూపించలేరని, తమను ఏమీ చేయలేరని పలుమార్లు విర్రవీగిన పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి ఇప్పుడు అరెస్టు అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆయన అరెస్టు జరిగినట్టయితే.. మూడున్నరవేల కోట్ల రూపాయల అతిపెద్ద కుంభకోణంలో అరెస్టు అయిన రెండో రాజకీయ నాయకుడు అవుతారు.
జగన్ ప్రభుత్వం కాలంలో లిక్కర్ వ్యాపారం పేరుతో ఏ రకంగా సొమ్ములు కాజేశారో ప్రజలందరికీ అర్థమైంది. లిక్కర్ ద్వారా దక్కే ప్రతి రూపాయి ఆదాయాన్ని కూడా ప్రభుత్వ ఖజానాకే చేరుస్తానంటూ పెద్ద పెద్ద ప్రతిజ్ఞలు చేసి.. జగన్మోహన్ రెడ్డి.. దుకాణాలు అన్నింటినీ ప్రభుత్వం పరిధిలోకి తెచ్చారు.

అలాగే ప్రజలతో మద్యం అలవాటు మాన్పిస్తానంటూ.. లిక్కర్ ధరలను ఒక్కొక్కటి రెట్టింపు చేశారు. అదే సాకుతో.. లిక్కర్ వ్యసన పరులు అలవాటుగా తాగే మద్యం బ్రాండ్లు ఏవీ రాష్ట్రంలో అమ్మడానికి వీల్లేకుండా కూడా చేశారు. ఇవన్నీ ప్రజలకోసమే చేస్తున్నానంటూ జగన్మోహన్ రెడ్డి నంగివచనాలు పలికితే జనం కూడా నమ్మారు. ఇప్పుడు అంతా తేటతెల్లం అయింది.

పెంచిన మద్యం ధరలను మొత్తం తాను కాజేయడం కోసం మాత్రమే జగన్ ఈ కొత్త లిక్కర్ పాలసీని తీసుకువచ్చినట్టు తేలింది. కేవలం.. ఏయే కంపెనీలకు ఎంతెంత ఆర్డర్లు వెళుతున్నాయి.. ఏయే కంపెనీలనుంచి ఎంత దందాలు దోచుకోవాలని అనేది లోపరహితమైన లెక్కలు తనకు తెలియడం కోసం మాత్రమే.. అయితే ఈ పాలసీ రూపకల్పన దగ్గరినుంచి, వసూళ్ల నెట్వర్క్ ను చాలా పగడ్బందీగా నడిపించిన రాజ్ కెసిరెడ్డి దళాల నుంచి అంతిమలబ్ధిదారుకోసం చివరి పాయింట్ గా పుచ్చుకోవడం వరకు వ్యవహారం మొత్తం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నడిపించారు.

ఇందుకు సంబంధించి పోలీసులు పక్కా ఆధారాలూ సేకరించారు. మద్యం కంపెనీలనుంచి ఆయనకు చెందిన పీఎల్ఆర్ కంపెనీలకు 5 కోట్లు బదిలీ అయినట్టు అధికారులు గుర్తించగా, ఆ తర్వాత.. ఆయన ఆ డబ్బును వెనక్కు పంపారు. అయినా పాపం దాగలేదు.
మొత్తానికి హైకోర్టు ఆయన బెయిలు దరఖాస్తును తిరస్కరించడంతో ఇక అరెస్టు తప్పదనే ఊహాగానాలు రాజకీయవర్గాల్లో నడుస్తున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories