వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి అయిదేళ్లు పూర్తయ్యాయి. ఈ అయిదేళ్లూ ఆయన అన్నయ్య కొడుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం వెలగబెడుతున్నారు. అయినా సరే చిన్నాన్న హత్యకేసును ఇప్పటిదాకా ఆయన ఒక కొలిక్కి తేలేకపోయారు. -ఈ వ్యవహారం చూస్తే సామాన్యులకు ఎలాంటి భావం కలుగుతుంది? ఈ ప్రభుత్వం తమకు ఎలాంటి రక్షణ కల్పించగలదు అనే భయం పుడుతుందా? లేదా? నిజానికి సామాన్యుల భయం తర్వాత, సొంత చెల్లెళ్లు చేస్తున్న ఆరోపణలు ఇంకా తీవ్రమైనవి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పునాదులు వివేకా, కోడికత్తి శ్రీను రక్తంతో తడిచిపోయాయని.. ప్రతి ఒక్కరూ వైకాపా నుంచి బయటకు రావాలి. లేకపోతే ఈ పాపం మీకు కూడా చుట్టుకుంటుంది. హంతకులున్న, హంతకుల పార్టీకి ఓటు వేయొద్దు.. జగనన్న పార్టీని ఎన్నికల్లో గెలవనీయొద్దు.. నా తండ్రిని హత్య చేసిన వారికి శిక్ష పడాలి.. అని సునీత ప్రజల ఎదుట భోరుమన్నదంటే.. జగన్ వైఖరితో వారు ఎంతగా విసిగివేసారిపోయారో కదా అనిపిస్తుంది.
కడప ఎంపీ అవినాష్ రెడ్డి ని ఓడించడం మాత్రమే కాకుండా.. మొత్తం కడప జిల్లాలోనే వైఎస్ జగన్ కు ఉండగల ఆదరణకు గండికొట్టేలా ఆయన చెల్లెళ్లిద్దరి మాటలు ఉన్నాయి. సునీత స్వయంగా వైసీపీ పునాదులే రక్తంతో తడిచి ఉన్నాయని అంటున్నారు. ఇంత తీవ్రమైన ఆరోపణలకు పార్టీ తరఫున సమాధానం చెప్పి తీరాల్సిందే. సాధారణంగా ఎలాంటి సీరియస్ ఆరోపణలకు స్వయంగా ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాల్సి వస్తుందో అలాంటి వాటన్నింటికీ సజ్జల రామకృష్ణారెడ్డి తెరముందుకు వచ్చి మాట్లాడుతుంటారు. ఈ సందర్భంలో కూడా.. పార్టీ పునాదుల్లో, వారు సాధించిన అధికారం పునాదుల్లో బాబాయిని చంపిన నెత్తురు ఉన్నదనే ఆరోపణకు కనీసం సజ్జల అయినా సంజాయిషీ చెప్పాలి. అవినాష్ రెడ్డి కూడా నోరు విప్పాలి. తండ్రిని కూతురే చంపేసిందని గుడ్డకాల్చి పడేయడం కాదు.. ఇన్నాళ్లుగా కేసు ఎందుకు తేలడంలేదో చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి మౌనంగా ఉండిపోయినంత మాత్రాన ఆయనకు అంటిన నెత్తుటి మరక తొలగిపోతుందని అనుకుంటే భ్రమ. అందుకే ఆయన ఆ జిల్లాలో ప్రచారానికి అడుగుపెట్టే ముందే సంజాయిషీలతో సిద్ధంగా ఉండాల్సిందేనని ప్రజలు ఆశిస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరవాత తెచ్చిన పథకాలతో ప్రజలను ఆకర్షిస్తుండవచ్చు. కానీ మౌలికంగా ఆయనకున్న క్రేజ్ కేవలం వైఎస్ఆర్ కొడుకుగా మాత్రమే. ప్రత్యేకించి వైఎస్ అంటే ఎంతో అభిమానం ఉండే వ్యక్తులున్న కడపజిల్లాలో అది ఇంకా ఎక్కువ. వైఎస్సార్ కొడుకుగా మాత్రమే ఆయనను అభిమానిస్తుంటారు. ఆ రకమైన తండ్రి వలన వచ్చే ప్రజాభిమానం కూతురు వైఎస్ షర్మిలకు కూడా సమానంగా దక్కే అవకాశం ఉన్నదని జగన్ తెలుసుకోవాలి. బాబాయి హత్య కేసు గురించి మాట్లాడకుండా మౌనం వహిస్తే.. ప్రజలు తనకు క్లీన్ చిట్ ఇచ్చేస్తారని జగన్ భ్రమిస్తే.. ఇబ్బందేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.