పెమ్మసాని సంకేతాలు: మహానాడులో ఈ హామీ గ్యారంటీ!

రెండు సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించుకోబోతోంది. అంగరంగవైభవంగా జరిగే ఈ వేడుకలు.. పార్టీ ఆవిర్భవించిన తరువాత.. తొలిసారిగా కడపజిల్లాలో జరగబోతున్నాయి. 2024లో ఎన్నికలు పూర్తయి.. ఫలితాల కోసం నిరీక్షిస్తున్న సమయంలో తెలుగుదేశం మహానాడు నిర్వహించలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ఈ వేడుకలు బ్రహ్మాండంగా ఉంటాయనడంలో సందేహం లేదు. అయితే.. ఈ వేడుకల సందర్భంగా.. పార్టీనే నమ్ముకుని కొన్ని దశాబ్దాలుగా సేవలందిస్తున్న, పార్టీకోసం అనేక ఇబ్బందులు పడుతూ వచ్చినా, పార్టీ కి చిత్తశుద్ధి గల కార్యకర్తల బలంగా ఉన్న వారికి ఒనగూరేది ఏమిటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. అయితే గత ప్రభుత్వం హయాంలో వేధింపులు ఎదుర్కొన్న వేలమంది తెలుగుదేశం కార్యకర్తలకు ఈ మహానాడు సందర్భంగా ఊరట కలిగించే ఒక పెద్దహామీ లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి హయాంలో తెలుగుదేశం పార్టీకి చెందిన వారిమీద రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అనేక కేసులు నమోదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిచోటా కూడా ఈ వేధింపులు కొనసాగాయి. కేసులుపెట్టారు.. జైళ్లలో పెట్టారు. అనేక ఇబ్బందులు పెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. చాలా వరకు కేసులనుంచి ఉపశమనం కల్పించారు. ఏ పాపమూ ఎరుగని వారి మీద కూడా ఇంకా అనేక మంది మీద కేసులున్నాయి. వాటిని ప్రభుత్వం ఎప్పుడు తొలగిస్తుందా? అని ఎదురుచూస్తున్నారు.

అదే సమయంలో మరో విషయంలో కూడా తెలుగుదేశం కార్యకర్తలు నిరీక్షిస్తున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వహయాంలో తెలుగుదేశానికి చెందిన పలువురు చిన్న చిన్న కాంట్రాక్టు పనులు చేశారు. ఉపాధి హామీ పనులు కూడా కాంట్రాక్టుల కింద చేశఆరు. జగన్ సర్కారు గద్దె ఎక్కిన తర్వాత వారందరికీ బిల్లుల చెల్లింపు నిలిపివేసింది. కొందరి విషయంలో పనులు- చెల్లింపులు కూడా పూర్తయినట్టు రికార్డుల్లో నమోదుచేసి, బిల్లులు ఆపేశారు. ఉపాధి హామీ పనులు వంటి వాటి విషయంలో అసలు పనులు జరగనేలేదని కేంద్రానికి నివేదికలు రాసి పంపేసి వారికి బిల్లులు రాకుండా చేశారు. పనులు పూర్తిచేసిన వారంతా గొల్లుమంటున్నప్పటికీ వారి గోడు పట్టించుకునే వారు లేరు.

గుంటూరులో జరిగిన మినీ మహానాడులో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కార్యకర్తలపై కేసులు పూర్తిగా తొలగించేందుకు కసరత్తు చేస్తున్నామని, అలాగే పెండింగ్ బిల్లులన్నీ కూడా చెల్లించేందుకు మార్గాన్వేషణ జరుగుతున్నదని చెప్పారు. చిన్నస్థాయి నాయకులు, కార్యకర్తలు ఎదురుచూసే ఈ రెండు పనులకు సంబంధించి మహానాడులో నిర్దిష్టమైన హామీ వస్తుందని అంతా ఎదురుచూస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories