కేటాయించిన కాల్షీట్లు అయిపోయాయి. తాడేపల్లి లొకేషన్ కు ఆయన ప్యాకప్ చెప్పేశారు. నిజానికి నెక్ట్స్ షెడ్యూల్ లండన్ ప్లాన్ చేశారు. కానీ టెక్నికల్ రీజన్స్ తో ఆ షెడ్యూల్ వెనక్కు వెళ్లింది. షెడ్యూలు మధ్యలో గ్యాప్ రావడంతో ఆయన బ్రేక్ తీసుకున్నారు. చిన్న గ్యాప్ ను కూడా చక్కగా వాడుకోవడానికి బెంగుళూరు ప్యాలెస్ కు వెళ్లిపోయారు.
.. ఇదంతా ఏదో సినిమా హీరో గారి గురించి చెబుతున్న కథ కాదు. అచ్చంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలో ప్రస్తుతం జరుగుతున్న క్రమం ఇదే. విజయవాడ ప్రాంతా ప్రజలందరూ ఇంకా వరద కౌగిట్లోనే ఇబ్బందులు పడుతూ ఉంటే.. ఈ మాజీ ముఖ్యమంత్రి ఆ కష్టాలు తనకు ఏమాత్రం సంబంధం లేని వ్యవహారంలాగా.. ఎంచక్కా బెంగుళూరు ప్యాలెస్ కు వెళ్లిపోయారు.
వరద ప్రజల్ని అతలాకుతలం చేసిన రెండురోజుల తరువాత బెంగుళూరు ప్యాలెస్ నుంచి ఇడుపులపాయ ప్యాలెస్ కు వచ్చి.. తండ్రికి నివాళి అర్పించి అక్కడినుంచి బెజవాడకు కాల్షీట్లు ఇచ్చారు జగన్! ప్రజలు వరద ముప్పులో యాతన పడుతున్న రోజుల్లో జగన్ ఒకసారి.. వారి చెంతకు వెళ్లారు. ఆయన నీళ్లలో దిగి నడవడమే.. ఆయన భజనగాళ్లకు ఒక అద్భుత విషయంగా కనిపించింది. జనాన్ని పరామర్శించి.. చంద్రబాబునాయుడు ప్రభుత్వం మీద నిందలు వేశారు. వరదలో బాధపడుతున్న వారిని ఆదుకోవడం చేతకావడం లేదని అన్నారు. ప్రభుత్వంచేస్తున్న సాయాన్ని ప్రజలే ఆయనకు చెప్పి, అంతకంటె ఏ ప్రభుత్వమైనా ఏం చేయగలదని అనడంతో.. తోక ముడిచి ఇంటికెళ్లారు. కోటి రూపాయల సాయం పార్టీ తరఫున ప్రకటించారు గానీ.. అదంతా పార్టీ నాయకుల ద్వారానే ఖర్చు పెడుతున్నట్టుగా నీళ్ల బాటిళ్లు, అన్నం ప్యాకెట్లు ఇస్తూ షో చేసారు. జగన్ మళ్లీ ఓసారి జనంవద్దకెళ్లి.. జనం కష్టాల సంగతి పక్కన పెట్టి, తననుకలవడానికి, తన చేతిని తాకడానికి వారంతా ఎగబడిపోతున్నట్టుగా చాలా బిల్డప్ ఇచ్చారు.
షెడ్యూలు ప్రకారం ఈ జనం కష్టాలను గాలికొదిలేసి యూకే ట్రిప్ వెళ్లాల్సి ఉంది. కానీ.. కేసుల మీద కేసులు కోర్టుల్లో పెండింగు ఉండడంతో ఆయన పాస్ పోర్టు లేక కదల్లేదు. పాస్ పోర్టు కోసం కూడా హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ గ్యాప్ లో మళ్లీ బెంగుళూరు ప్యాలెస్ కు పయనం అయ్యారు. కోర్టు తీర్పును బట్టి లండన్ బయల్దేరే వరకు ఆయన బెంగుళూరు యలహంక ప్యాలెస్ లోనే ఉంటారని సమాచారం.