లోకేష్ ను చూసి నేర్చుకోరాదా జగన్ !

కోర్టుకు హాజరు కావడం అనేది అంత నామోషీ అయిన వ్యవహారం కానే కాదు. పైగా అవినీతి అక్రమార్జనల కేసుల్లో కొన్ని ఏళ్లపాటూ ప్రతి శుక్రవారమూ కోర్టుకు హాజరుకావడానికి విధిగా ఇతర పనులు అన్నీ మానుకోవడం కూడా అలవాటైన వ్యక్తికి.. ఒక చిన్న కేసు విషయంలో కోర్టుకు హాజరు కావడానికి సమయం లేదని అనడం బుకాయింపు, పలాయనవాదం, అహంకారం తప్ప మరొకటి కాదు. ఏదైనా కేసులో వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావడం వలన.. వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా హాజరు కావడం అనేది మంచి పద్ధతి. ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రస్తుత మంత్రి నారా లోకేష్ ను చూసి నేర్చుకోవాలని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

ఎందుకంటే.. నారా లోకేష్ తాజాగా కూడా విశాఖ కోర్టుకు హాజరయ్యారు. తన మీద రాసిన తప్పుడు వార్తలకు సంబంధించి.. సాక్షి పత్రిక మీద పరువునష్టం దావా వేసిన నారా లోకేష్ అయిదు సంవత్సరాలుగా న్యాయపోరాటం చేస్తున్నారు. తను వ్యక్తిగతంగా హాజరు కావాల్సి వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఆయన వస్తూనే ఉన్నారు. పైగా రాష్ట్రానికి మంత్రి అయిన తర్వాత కూడా.. కోర్టు కేసు కోసం హాజరు అవుతున్నప్పుడు తన సొంత ఖర్చుతోనే వస్తున్నానని, పార్టీ ఆఫీసులో, బస్సులో నిద్రపోతున్నానని. సొంత భోజనం తింటున్నానని కూడా నారా లోకేష్ చెబుతున్నారు. ఆయన పాటిస్తున్న ఈ విలువలను కూడా అనుసరించడం చేత కాకపోయినప్పటికీ.. కనీసం తన హాజరు అవసరం ఉన్నప్పుడు కోర్టుకు వెళ్లడం అనేది మర్యాద అనేది జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి.
ప్రధానంగా విశాఖ కోడి కత్తి కేసు ఎన్ఐఏ కోర్టులో ఇంకా సాగుతూనే ఉంది. జగన్ మీద కోడికత్తితో హత్యకు యత్నించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న శీను.. నిర్దోషి అని విచారణలో ఎన్నడో తేల్చేశారు. అయితే జగన్ స్వయంగా ఒకసారి కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇస్తే చాలు.. అతడిని పూర్తిగా కేసునుంచి విముక్తుడిని చేసే అవకాశం ఉంది. 2019 ఎన్నికలకు పూర్వం.. కోడికత్తి డ్రామా ఆడి.. తన మీద హత్యాయత్నం జరిగినట్టుగా చాటుకుని.. ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి.. దళితుడైన నిందితుడు శీను కేసు నుంచి బయటపడడానికి ఏమాత్రం సహకరించడం లేదు. ముఖ్యమంత్రిగా ఉన్న అయిదేళ్లూ ఆ పదవిలో బిజీగనుక రాలేనని కోర్టుకు డుమ్మా కొట్టారు. పదవి పోయిన తర్వాత కూడా విచారణకు హాజరు కావడం లేదు. కేసు ముగియడం లేదు. ఆ కేసులో కోర్టుకు హాజరై.. వాంగ్మూలం ఇవ్వడం అనేది తనకు పరువు తక్కువ వ్యవహారం అని ఆయన భావిస్తున్నారేమో తెలియదు.

అవినీతి కేసుల్లో ప్రతి వారమూ కోర్టుకు హాజరై.. జడ్జి పిలిచే వరకు వెయిట్ చేస్తూ రోజంతా అక్కడే కూర్చుని ఉన్న అనుభవాలను కూడా కలిగిన జగన్మోహన్ రెడ్డి, ఒక వ్యక్తి విముక్తి కోసం కోర్టుకు హాజరు కావడంలో అహంకారం చూపించడం తగదని ప్రజలు అంటున్నారు. కేసు నిజమే అయితే.. స్వయంగా హాజరు కావడం కూడా బాధ్యత అని లోకేష్ ను చూసి తెలుసుకోవాలని వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories