కాకాని గోవర్ధన్ రెడ్డి త్వరలోనే అరెస్టు అయ్యే అవకాశం ఉన్నదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఆయన అక్రమాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మాజీ మంత్రి అనుచరుల చుట్టూ ఇప్పుడు క్వార్ట్జ్ దోపిడీకి సంబంధించిన ఒక కేసు ఉచ్చు బిగుస్తోంది. మైనింగ్ దందా సాగించడంలో ఈ అక్రమాలకు పాల్పడినట్లుగా అధికారులు గుర్తించి కాకాణి ని ఏ4గా చేర్చారు. ఈ కేసులో కొందరికి ఇప్పటికే ముందస్తు బెయిలు దక్కింది. కొందరు రిమాండులో ఉన్నారు. త్వరలోనే కాకాణి అరెస్టు జరుగుతుందని పలువురు అంచనా వేస్తున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ నాయకులు పలువురు.. రాజీనామాలు చేసేశారు. పార్టీలో మిగిలిఉన్నవారిలోనూ చాలా మంది.. మొహం చాటేస్తున్నారు తప్ప పార్టీ కార్యక్రమాలకు కూడా రావడం లేదు. పార్టీ లైన్స్ లో ప్రభుత్వాన్ని తిట్టడంలో చురుగ్గా లేరు. అయితే.. తాడేపల్లి పురమాయింపుల మేరకు ఎప్పుడు ప్రభుత్వాన్ని తిట్టిపోయాలన్నా సరే.. రెడీ అంటూ ముందుకు వచ్చే నోటిదూకుడు నేతల్లో ఒకరుగా కాకాణి గోవర్దనరెడ్డి కి గుర్తింపు ఉంది. అలాంటి నాయకుడు కూడా ఇప్పుడు అరెస్టు అవుతున్నారని పార్టీలో అనుకుంటున్నారు.
ఇప్పుడంటే క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల కేసులో అరెస్టు అయ్యే ప్రమాదం ఉంది. అయితే ఇంకా అనేక అక్రమాలకు సంబంధించిన కేసులు ఆయన చుట్టూ ముసురుకుంటున్నాయి. సర్వేపల్లి రిజర్వాయర్, చెరువులో పెద్ద ఎత్తున గ్రావెల్ అక్రమ తవ్వకాలు చేపట్టి, వందల కోట్లు స్వాహా చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ దుర్మార్గం కోసం ఏకంగా ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. మాగుంట పేరుతో అక్రమ అనుమతులు తీసుకోవడం మీద కూడా కాకాని మరియు ఆయన అనుచరుల మీద కేసులు నమోదయ్యాయి.
మాగుంట శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఎంపీగా కొనసాగుతున్నారు. ఆయన సంతకాన్ని గతంలో ఫోర్జరీ చేసి ఈ దుర్మార్గాలకు పాల్పడిన తీరు పట్ల కూటమి ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ గ్రావెల్ అక్రమాల మీద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సుదీర్ఘ పోరాటం సాగించారు. ఆయన మీద అప్పట్లో కక్షపూరితంగా కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టించారని ఆరోపణలు కూడా ఉన్నాయి. మొత్తానికి ఈ దందా వ్యవహారం ఇన్నాళ్లకు బట్టబయలవుతోంది.
క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల బాగోతం కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోరాటంతోనే వెలుగులోకి వచ్చింది. గతంలో ఆయన క్వార్ట్జ్ గనుల వద్దనే సత్యాగ్రహ దీక్ష చేశారు. రాష్ట్రప్రభుత్వం పట్టించుకోదనే భయంతో.. కేంద్ర మైనింగ్ శాఖకు ఫిర్యాదు చేశారు. ఈలోగా రాష్ట్రంలో కూడా ప్రభుత్వం మారడంతో.. మైనింగ్ అధికారులు వచ్చి తనిఖీలు నిర్వహించారు. మొత్తంగా దాదాపు 250 కోట్ల రూపాయల విలువైన క్వార్ట్జ్ గనులను అక్రమంగా తవ్వి స్వాహా చేసినట్టుగా గుర్తించారు. ఈకేసులో ఏ4గా ఉన్న కాకాణి గోవర్దన్ రెడ్డి అరెస్టు త్వరలోనే ఉంటుందని అనుకుంటున్నారు.