‘అలాంటి నిబంధన ఎక్కడ ఉందో చూపించండి’ అని జగన్ ప్రశ్నించినంత మాత్రాన రాజ్యాంగంలో ఉన్న నిబంధనలు మారిపోవు. వాటిని ప్రస్తావిస్తున్న వారు బెదిరిపోరు. గతంలో ఎవరైనా ఇలాంటి నిబంధనను వాడుకున్నారా? లేదా? అని ఆలోచించేముందు.. గతంలో ఎవరైనా ఇంత అరాచకంగా సభకు హాజరుకాకుండా దారితప్పి ప్రవర్తించారా? అనేది వారు ఆత్మసమీక్ష చేసుకోవాలి. మితిమీరిన అహంకారంతో, ప్రజలు తిరస్కరించిన ప్రతిపక్ష నేత హోదా కావాలనే సాకుతో, అసలు శాసనసభకే రాకుండా నిందలు వేస్తూ గడుపుతున్న జగన్మోహన్ రెడ్డికి తమ మీద అనర్హత వేటు పడక తప్పదని స్పష్టంగా అర్థమైపోయినట్టు కనిపిస్తోంది. స్పీకరు చర్య తీసుకుంటే అది అనర్హత వేటు అవుతుంది.. తామే రాజీనామా చేస్తే త్యాగం అవుతుంది.. అని ఆయన ఫిక్సయినట్టుగా కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యే ద్వారా తామంతా పదవులకు రాజీనామా చేస్తాం అనే మాట చెప్పిస్తున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఓ ప్రెస్ మీట్ పెట్టారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేల దళంలో.. జగన్ తప్ప.. అప్పుడప్పుడూ మీడియా ముందు కనిపిస్తున్న ఏకైక ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాత్రమే అని చెప్పాలి. ఆయన కూటమి ప్రభుత్వం మీద రకరకాల నిందలు వేశారు. జగన్ హయాంలో పాలన మీద చాలా నిందలు వేశారని, జగన్ పాలనలో తాము కేవలం 3.7 లక్షల కోట్ల అప్పులు మాత్రమే చేశామని, కానీ చాలా దుష్ప్రచారం చేశారని సమర్థించుకున్నారు. రైతులను ఆదుకోవడం లేదని ప్రభుత్వాన్ని విమర్శించారు. అమరావతి రాజధాని నగరాన్ని పీపీపీ విధానంలో ఎందుకు నిర్మించడం లేదని ప్రశ్నించడం ద్వారా తన అవగాహన రాహిత్యాన్ని బయటపెట్టుకున్నారు. ఈ మాటలన్నీ ఒక ఎత్తు అయితే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరమూ రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించడం మరో ఎత్తు!
అవును. తమ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. ప్రజలకోసం కాకపోతే.. చంద్రబాబు కూడా రాజీనామా చేయాలని ఆయన మెలిక పెడుతున్నారు. ప్రభుత్వ పాలనపై రెఫరెండంగా ఎన్నికలకు వెళ్లాలని అంటున్నారు. ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు మాత్రమే అయిన ప్రస్తుతం సమయంలో.. రాష్ట్రవ్యాప్తంగా అనేక పనులు చురుగ్గా సాగుతున్న సమయంలో అసలు రాజీనామా అనే మాట ఏ నేత నోట అయినా ఎందుకు వచ్చిందనేది ప్రశ్న. ప్రస్తుతం అసెంబ్లీ పరిణామాలను గమనిస్తే.. అసెంబ్లీకి ఆబ్సెంట్ అవుతున్న వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని అర్థమై.. ముందుగా.. రాజీనామాలు చేస్తాం అంటూ తాటిపర్తి చంద్రశేఖర్ ఓవరాక్షన్ చేస్తున్నారా? అనే అనుమానం ప్రజల్లో కలుగుతోంది.