ఈ దఫా పేర్ని నాని అరెస్టు తప్పదా?

అయిదేళ్ల విధ్వంసక పాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో మంత్రి పదవి దక్కినా కూడా సద్వినియోగం చేసుకోకుండా.. ఆయన తన సొంత నియోజకవర్గంలో ఎంత అపకీర్తిని మూటగట్టుకున్నారంటే.. ఆయనకు టికెట్ ఇస్తే పార్టీ సీటును కోల్పోతుందని భయపడి జగన్ కూడా పక్కన పెట్టారు. ఆయన కొడుకును రంగంలోకి దించారు. ఎటూ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. తన సొంత పార్టీలోనే తనకు  ఠికానా లేకుండా పోయినప్పటికీ.. మాజీ మంత్రి పేర్ని నానికి మాత్రం అహంకారం తగ్గలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ఆయన ఎన్ని సందర్భాల్లో అత్యంత దారుణంగా మాట్లాడుతూ.. రెచ్చిపోతూ వచ్చారో అందరూ చూస్తున్నదే. ఇప్పటికే పలు సందర్భాల్లో అవినీతికేసుల్లో అరెస్టు కాకుండా తృటిలో తప్పించుకున్న పేర్ని నాని, ఈ దఫా అరెస్టు కాక తప్పదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేర్ని నాని కొన్నాళ్లపాటు జాగ్రత్తగానే ఉన్నారు. తన భార్య పేరిట ఉన్న గోడౌన్ల నుంచి ప్రభుత్వ రేషన్ బియ్యం టన్నుల కొద్దీ మాయం అయినప్పుడు.. ఆ కేసుల్లో అరెస్టు చేస్తారని భయపడి ఆయన కొన్నాళ్లపాటు భార్యతో సహా పరారయ్యారు. కోర్టునుంచి రక్షణ దక్కిన తర్వాత.. తిరిగి నియోజకవర్గంలో ప్రత్యక్షం అయ్యారు. అప్పటినుంచి మళ్లీ తన దురహంకార రాజకీయం నడిపిస్తున్నారు. ప్రత్యేకించి ఇటీవలి కాలంలో.. కూటమి ప్రభుత్వ నాయకుల మీద అడ్డగోలుగా రెచ్చిపోతూ బండబూతులు తిడుతున్నారు. ‘రప్పా రప్పా నరుకుతాం’ అనే వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా వివాదస్పదంగా మారిన తర్వాత.. వైసీపీ నాయకులు వాటిని సమర్థించుకునే పనిలో పడ్డారు. అయితే.. పేర్ని నాని మాత్రం.. ‘అరిచే కుక్క కరవదు.. కరిచే కుక్క అరవదు.. అయినా ఆ మాటలు అనడం ఏంటి.. రాత్రి కన్నుకొడితే తెల్లారేలోగా నరికేయాలి.. తెల్లారాక పరామర్శకు వెళ్లాలి’ అంటూ కార్యకర్తలను రెచ్చగొట్టేలా వివాదస్పదంగా మాట్లాడారు.

ఈ మాటలు ఘర్షణలను పెంచేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయంటూ తెదేపా నాయకుల ఫిర్యాదుతో కృష్ణా జిల్లా పామర్రులో కేసు నమోదు అయింది. ఆ తర్వాత కూడా పేర్ని నాని దూకుడు ఏ మాత్రం తగ్గలేదు గానీ.. ముందు జాగ్రత్తగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విషయంలో పోలీసులు తన మీద తొందరపాటు చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని ఆయన అభ్యర్థించారు. ఆయన పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. విచారణను ఈనెల 22కు వాయిదా వేసింది.

హైకోర్టు ఆయన పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో.. పోలీసులు నానిని అరెస్టు చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. పోలీసులను ఉద్దేశించి కూడా అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నాని.. ఈ దఫా అరెస్టు నుంచి తప్పించుకోలేరని అంటున్నారు. కాగా, గతంలో బియ్యం స్మగ్లింగ్ దందా బయటకు వచ్చినప్పుడు కుటుంబంతో సహా పరారైనట్టే.. కోర్టు తీర్పు తర్వాత నాని పరారయ్యే అవకాశం ఉన్నదని తదనుగుణంగా పోలీసులు ముందుగానే నిఘాపెట్టినట్టు, జాగ్రత్తలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అడ్డూ అదుపూ లేకుండా విచ్చలవిడిగా రెచ్చిపోతున్న నాని.. రేపో మాపో అరెస్టు కావల్సిందేనని పలువురు భావిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories