“చంపేయండ్రా బై ఎలక్షన్స్ వస్తాయి” అని అంటున్న మాటలు వీడియోలో చాలా స్పష్టంగా రికార్డు అయ్యాయి. ఆ స్వరం ఎవరిదో పోలీసులు నిగ్గు తేల్చడం పెద్ద కష్టమేమీ కాదు. అవి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాటలు స్థానికంగా ప్రచారం ఉంది. కేసు నమోదు అయిన తర్వాత ఇప్పటికే కొందరిని అరెస్టు చేసిన పోలీసులు తాజాగా మోహిత్ రెడ్డి పేరును కూడా నిందితుల జాబితాలో చేర్చారు. ఇప్పుడు రెండు మూడు రోజుల్లోగా మోహిత్ రెడ్డి అరెస్టు తప్పదని వినిపిస్తోంది.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కొడుకు మోహిత్ రెడ్డి గత ఐదు ఏళ్ల పాటు ఎంత విచ్చలవిడిగా తమ నియోజకవర్గంలో దందాలను నడిపించారో అందరికీ తెలుసు. విచ్చలవిడిగా భూకబ్జలకు పాల్పడుతూ చెలరేగిపోయారు. ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. అయినా ఓటమి భయం వెన్నాడింది. జగన్ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తండ్రీ కొడుకులు ఇద్దరికీ శాపంగా మారింది. ఆ అసహనంలో ఇంకా బరితెగించారు.
కౌంటింగ్ కేంద్రం వద్దకు వెళ్లిన టిడిపి అభ్యర్థి పులివర్తి నాని మీద, మోహిత్ రెడ్డి తన అనుచరులను హత్యకు ఉసిగొల్పి రెచ్చగొట్టారు. ఈ సందర్భంగానే “చంపేయండ్రా బై ఎలక్షన్స్ వస్తాయి” అని చెప్పిన మాటలు కూడా బయటకు వచ్చాయి. ఈ దాడిలో నాని తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచారు. ఫలితాలకు ముందే నాని కేసు పెట్టినప్పటికీ పోలీసులు మొక్కుబడి కేసులు మాత్రమే నమోదు చేశారు.
తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసుల పురోగతి వేగం పుంజుకుంది. మోహిత్ రెడ్డి అనుచరులను అరెస్టు చేశారు. ఇప్పుడు మరింత పక్కా ఆధారాలతో మోహిత్ రెడ్డిని కూడా అరెస్టు చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.
మోహిత్ రెడ్డి పేరును 37 వ నిందితుడిగా చేర్చారు. మోహిత్ ముందస్తు బెయిల్ కోసం హై కోర్టు ను ఆశ్రయించారు. కోర్టు ఆయన పిటిషన్ ను స్వీకరించారు గానీ, విచారణ వాయిదా వేశారు. దీంతో మోహిత్ రెడ్డి అరెస్టు ఒకటి రెండు రోజుల్లో జరగ వచ్చునని తెలుస్తోంది.