జగన్ జమానాలో రెండో విడత మంత్రివర్గంలో చోటు దక్కించుకుని తన జిల్లావ్యాప్తంగా విచ్చలవిడి దోపిడీలకు, దందాలకు పాల్పడిన నాయకుడు కాకాణి గోవర్దన్ రెడ్డి. ఆయన ప్రస్తుతం అక్రమ మైనింగ్ కేసుల్లో రిమాండులో ఉన్నారు. ఆయన అధికారంలో ఉన్న కాలంలో చేసిన అక్రమాల గురించి పోలీసులు కేసులు నమోదు చేసినప్పుడు.. ఒక రేంజిలో రెచ్చిపోయిన నాయకుడు కాకాణి. పోలీసులను నడిబజార్లో బట్టలు విప్పదీయించి కొడతానంటూ ఆయన తెగ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వ్యక్తి.. కొన్ని నెలల పాటు పరారీలో ఉండి కలుగులో దాక్కుని, ఎట్టకేలకు న్యాయపరంగా ఎలాంటి రక్షణ మార్గాలు దొరకకపోగా డీలాపడ్డాక పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం రిమాండులో ఉన్నారు. కాగా, ఆయనకు తోడుగా.. నెల్లూరు జిల్లాకే చెందిన మరో మాజీ మంత్రి కూడా జైలుకు వెళ్లేలా ఉన్నదని ప్రస్తుత పరిణామాలు సంకేతాలు ఇస్తున్నాయి.
జగన్మోహన్ రెడ్డి హయాంలో నెల్లూరు జిల్లానుంచి కోట్ల రూపాయల విలువైన క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ చేసినట్టుగా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలు వినియోగించినట్టుగా అనేక ఆరోపణలున్నాయి. నెల్లూరు జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ కేసువల్ల చిక్కుల్లో పడే పరిస్థితి కనిపిస్తోంది. ఆయన కీలక అనుచరుల్లో ఒకడైన బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు సోమవారం హైదరాబాదులో అదుపులోకి తీసుకున్నారు.
సదరు శ్రీకాంత్ రెడ్డి అప్పట్లో మంత్రికి చాలా సన్నిహితంగా ఉంటూ దందాలు, అవినీతి కార్యకలాపాలు అన్నింటినీ స్వయంగా నడిపించేవాడని పోలీసులు గుర్తించారు. మంత్రి తరఫున ఆర్థిక లావాదేవీలు దందాలన్నీ తనే చూసేవారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో ఆయనను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తే గనుక.. అనిల్ కుమార్ యాదవ్ పాత్ర కూడా బయటకు వస్తుందని అంతా అనుకుంటున్నారు. దూకుడు విషయానికి వస్తే.. ఇప్పుడు రిమాండులో ఉన్న కాకాణి గోవర్దన్ రెడ్డి కంటె కూడా అనిల్ కుమార్ యాదవ్ చాలా దూకుడుగా ఉండేవాడు. మూడేళ్లు గడిచిన తర్వాత.. జగన్ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరిగినప్పుడు అనిల్ మంత్రిపదవి కోల్పోయారు. అప్పటినుంచి పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరించారు. నిజానికి జగన్ తనను మంత్రి పదవినుంచి తీసేసినందుకు ఆయన అలకపూనారని అనుకోవాలి.
ఎన్నికలువచ్చిన సమయానికి జగన్ ఆయనను నరసరావుపేట ఎంపీగా పోటీచేయించారు. ఆ సీటు, ఎంపీ పదవి తనకు వద్దే వద్దని అనిల్ కుమార్ పదేపదే అన్నప్పటికీ కూడా.. అక్కడ యాదవుల ఓట్లు చాలా ఉన్నాయనే ఆశతో జగన్ నెల్లూరు నుంచి అనిల్ ను తీసుకువచ్చి ఇక్కడ పోటీచేయించారు. రెండుచోట్ల పార్టీ దారుణంగా ఓడింది. ఈ నేపథ్యంలో అనిల్ రాజకీయవైభవం మొత్తం అంతరించిపోయిందిగానీ.. జగన్ జమానాకాలంలో చేసిన పాపాలు మాత్రం ఇంకా వెన్నాడుతున్నాయి. కొన్నిరోజుల వ్యవధిలోనే ఆయన అరెస్టు కూడా జరుగుతుందని పలువురు అనుకుంటున్నారు.