రెండేళ్ల కిందట గుజరాత్ లోని ముంద్రా పోర్టుకు మొహానికి రాసుకునే టాల్కమ్ పౌడరు రూపంలో కంటైనర్లలో డ్రగ్స్ వచ్చాయి. వాటి విలువ సుమారు 21వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. భారీగా హెరాయిన్ పట్టుబడింది. ఆఫ్గనిస్తాన్ నుంచి వచ్చిన ఆ కంటైనర్లు విజయవాడలోని ఓ ట్రేడింగ్ సంస్థవి అని తేల్చారు. ఆ సంస్థ, రాష్ట్రంలోని ఒక వైకాపా నాయకుడికి బినామీ సంస్థగా తేలడంతో పెద్ద సంచలనమే రేగింది. సీన్ కట్ చేస్తే..
ఇప్పుడు విశాఖ పోర్టుకే ఒక కంటైనర్ వచ్చింది. అందులో రొయ్యలకు మేతగా వేసే డ్రైడ్ ఈస్ట్ ఉన్నదని పైకి చెబుతున్నారు. మొత్తం 25 వేల కిలోలు బ్యాగుల్లో ఈ కంటైనర్లో ఉన్నాయి. అయితే ఈ బ్యాగుల్లో అత్యంత ఖరీదైన డ్రగ్స్ కలిసిఉన్నట్టుగా, సీబీఐ కస్టమ్స్ తనిఖీల్లో తేలింది. నిర్దిష్టంగా ఎంత భాగం డ్రగ్స్ ఉన్నాయనేది తేల్చలేదు గానీ.. వాటి విలువ మాత్రం లక్షల కోట్లలో ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఇంతవరకు అంతా బాగానే ఉంది. ఆ లక్షల కోట్ల డ్రగ్స్ కాకినాడజిల్లాలో ఉండే సంధ్య ఆక్వా పరిశ్రమ పేరుతో బుక్ అయిన కంటైనర్లో రావడం వలన.. సీబీఐ వాళ్లుగానీ, పోలీసులు గానీ.. వారితోనే ఏ సంగతీ తేల్చుకునేవాళ్లు. కానీ.. ఈ కంటెయినర్ ను అసలు తెరవనివ్వకుండా, తెరిచినా పరీక్షించనివ్వకుండా అడ్డు పడడానికి వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారనే ఆరోపణల నేపథ్యంలో అధికార పార్టీ మీద అనుమానాలు పుడుతున్నాయి. వైసీపీ నాయకుల ఒత్తిడితో కొందరు అధికారులు అసలు కంటెయినర్ తెరవనివ్వకుండా ప్రయత్నించినట్టు తెలుస్తోంది. సీబీఐ జోక్యం చేసుకోవడం వలన, అది సాద్యమైంది. అయినా పరీక్షలప్పుడు కూడా అక్కడి అధికారులు సహకరించలేదని వార్తలొస్తున్నాయి. ఇదంతా వైఎస్సార్ కాంగ్రెస్ దందానేనా అనే అభిప్రాయం ప్రజలకు కలిగిస్తోంది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్, ప్రధానంగా గంజాయి వాడకం విచ్చలవిడిగా పెరిగింది. ఏపీ మీదుగా ఇతర రాష్ట్రాల్లోకి కూడా గంజాయి స్మగ్లింగ్ ఒక రొటీన్ వ్యవహారం అయిపోయింది. పక్క రాష్ట్రాల్లో గంజాయి పట్టుబడినా సరే.. వాటి మూలాలు ఏపీలోనే ఉంటున్నాయి. వైసీపీ పెద్దలే గంజాయి సాగులోను, అక్రమ తరలింపుల్లోనూ తెరవెనుక ఉండి నడిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగబోతున్న సమయంలో .. ఇలా లక్షల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ను విదేశాలనుంచి తెప్పించి.. దేశమంతటా డ్రగ్స్ వ్యాపారానికి ఏపీని హబ్ గా మారుస్తున్నారా? అనిపిస్తోంది. మొత్తానికి ఈ దందాలో అసలు కీలక వ్యక్తులు ఎవరో విచారణలో తేలాలి.