థాంక్యూ సీఎం సార్’ అని ముద్రించిన పెద్ద ఫ్లెక్సిని పట్టుకుని కాలేజీ విద్యార్థులంతా పెద్ద గుంపుగా రోడ్డు పక్కన నిలబడి ఉండేసరికి.. ఇక్కడేదో మనకు మంచిగా మైలేజీ వచ్చేట్టున్నదని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముచ్చటపడి ఉండవచ్చు. దారమ్మట వెళుతున్న బస్సును.. అందుకోసం ఆపించి, బస్సు దిగి విద్యార్థులతో ముచ్చటించడం ప్రారంభం అయిన తర్వాత మాత్రం ఆయనకు చాలా గట్టి షాకే తగిలింది. విద్యార్థులంతా పెద్ద ఎత్తున పవన్ కల్యాణ్ కు అనుకూలంగా నినాదాలు చేయడంతో జగన్ షాక్ అయ్యారు. తీవ్రమైన అసహనానికి గురయ్యారు. కాసేపు అ అసహనం దాచుకోడానికి ప్రయత్నించినా.. విద్యార్థులు నినాదాలు మిన్నంటుతుండడంతో.. ఆయన తిరిగి బస్సెక్కి వెళ్లిపోయారు. ఇదంతా జగన్ నేర్పిన విద్యేనని.. ఆయన వద్ద నేర్చుకున్న విద్యతో ఆయనకే ఎదురుదెబ్బ తగిలిందని ప్రజలు అనుకుంటున్నారు.
కొన్నాళ్ల కిందట కడప జిల్లాలో వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచార సభ నిర్వహిస్తుండగా ఓ యువకుడు అక్కడకు వచ్చి మైకు అడిగి తీసుకున్నారు. ఏకబిగిన జగన్మోహన్ రెడ్డిని కీర్తించడం ప్రారంభించారు. షర్మిల అతడిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. జగన్ ను కీర్తించడంతో పాటు, షర్మిల పక్కనే నిల్చుని ఆమెను విమర్శించాడు. ఆమె మాత్రం చాలా సంయమనంతో వ్యవహరించారు. ఆ యువకుడి మాటలన్నీ అయిపోయాక.. అతడినుంచి మైకు అందుకుని తిరిగి తన ప్రసంగం కొనసాగించారు. ఈ రకంగా ప్రత్యర్థి సభలో.. తమ డప్పు కొట్టించుకునేందుకు జగన్ దళం ప్రయత్నించింది. ఇప్పుడు వైఎస్ జగన్ కు కూడా అదేమాదిరి అనుభవం ఎదురైంది.
కాకినాడ జిల్లా ఆదిత్య యూనివర్సిటీ ఎదురుగా జగన్ బస్సు యాత్ర వెళుతున్న సమయంలో అక్కడి యూనివర్సిటీ యాజమాన్యం ఒక ఏర్పాటు చేసింది. విద్యాదీవెనతో విద్యార్థులకు మేలు జరుగుతోందని తెలియజెప్పడానికా అన్నట్టుగా.. ‘థాంక్యూ సీఎం సార్’ అని ఒక భారీ ఫ్లెక్సిని ముద్రించి, పిల్లలతో నినాదాలు చేయించడానికి సిద్ధమైంది. పిల్లలందరినీ యూనివర్సీటీ వద్ద రోడ్డుపై నిలబెట్టారు.
విద్యార్థులు గుంపుగా ఉండడంచూసిన జగన్ బస్సు దిగి కళాశాల వైస్ ఛైర్మన్ సతీష్ రెడ్డితో మాట్లాడారు. విద్యాదీవెన గురించి ఆరా తీశారు. ఈలోగా స్టూడెంట్స్ ‘‘బాబులకే బాబు.. కల్యాణ్ బాబు’’ అంటూ నినాదాలు ప్రారంభించడంతో ఖంగుతిన్నారు. పవన్ కల్యాణ్ కు జై కొడుతూ వారి నినాదాలు హోరెత్తిపోయాయి. దాంతో అసహనానికి గురైన జగన్.. వెంటనే బస్సు ఎక్కి అక్కడినుంచి వెళ్లిపోయారు.