చిన్న సజ్జలకు కటకటాలు తప్పవా?

సజ్జల రామక్రిష్ణారెడ్డి కుమారుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో వెల్లువెత్తిన సకల బూతు, అసభ్య పోస్టులకు మూల కర్తగా ప్రచారంలో ఉన్నటువంటి సజ్జల భార్గవరెడ్డి అరెస్టు నుంచి తప్పించుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆయన ముందస్తు బెయిలు పిటిషన్ ఇప్పటికే తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై నమోదైన కేసుల్లో తనపై ఉన్న ఎఫ్ఐఆర్ లను కొట్టివేయాలని చిన్న సజ్జల సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. అసలు ఆ పిటిషన్ ను స్వీకరించడానికే సుప్రీం నిరాకరించింది. విజ్ఞప్తులు ఏమైనా ఉంటే హైకోర్టు ముందే చెప్పుకోవాలని వ్యాఖ్యానించింది.


వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ సైకోలు అనేకమంది మీద కేసులు నమోదు అవుతుండగా.. వారిని కాపాడే విషయంలో ఒక్కొక్కరి పట్ల పార్టీ ఒక్కొక్క నీతిని అవలంబిస్తోంది. అందరికీ న్యాయసహాయం అందిస్తాం అని చెప్పిన సజ్జల రామక్రిష్ణారెడ్డి మాటలు ఉత్తుత్తివే అని తేలిపోయాయి. కేసులు పెడుతున్నారని పార్టీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప.. కేసులకు గురవుతున్న వారికి అండగా నిలుస్తున్న దాఖలాలేమీ కనిపించడం లేదు. పైపెచ్చు.. పీకలదాకా ఈ కేసుల్లో కూరుకు పోయిన పులివెందుల కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డితో తమ పార్టీకి సంబంధమే లేదని వైసీపీ నాయకులు ప్రకటించేశారు. అదే సమయంలో.. సజ్జల భార్గవ రెడ్డి కోసం మాత్రం కోర్టుకేసులు నడపడానికి మహామహులు రంగంలోకి దిగుతున్నారు.


సజ్జల భార్గవరెడ్డి మీద పెట్టిన కేసులు అన్నీ కొట్టేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో సుప్రసిద్ధ న్యాయవాది కపిల్ సిబల్ ఆయన తరఫున వాదనలు వినిపించారు. అదే సమయంలో ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. సుప్రీం న్యాయస్థానం ముందు చాలా విషయాలు దాచిపెట్టారని చెప్పారు.


పాత విషయాల మీద కొత్త చట్టాల ప్రకారం కేసులు పెడుతున్నారనేది కపిల్ సిబల్ వాదించారు. చూడబోతే ఆ పాయింటు తప్ప సజ్జల భార్గవరెడ్డిని కాపాడడానికి ఆయనకు మరో మార్గం కనిపించినట్టుగా లేదు. కానీ.. చట్టాలు ఎప్పటివనేది కాదని, మహిళలపై చేసిన అసభ్య వ్యాఖ్యలు ఎలాంటివో చూడాలని సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. దుర్భాషలు ఉపయోగించే ఎవరైనా సరే.. చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిందేనని వ్యాఖ్యానిస్తూ సుప్రీం కోర్టు న్యాయమూర్తి సూర్యకాంత్.. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించడాన్నే తిరస్కరించారు. దీంతో చిన్న సజ్జల వ్యవహారం మొదటికొచ్చింది. ఆయనకోసం ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ అయి ఉన్నాయి. ఆయన అరెస్టు కాకతప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories