శెభాష్ నానాజీ.. ఈ వైఖరి సూపర్!

తప్పు చేయకుండా ఉండడానికి మనం మహర్షులం కాదు. ఆవేశంలోనో అపోహలతోనో అజ్ఞానంతోనో మన చేతుల మీదుగా ఏదో ఒక తప్పు జరిగిపోతుంది. తప్పు చేయడాన్ని క్షమించవచ్చు. అయితే.. తప్పు జరిగిందని తెలిసిన తర్వాత కూడా.. అహం వదలిపెట్టి.. దానిని దిద్దుకోవడానికి ప్రయత్నించకపోతే మాత్రం క్షమించలేము. ఈ విషయంలో జనసేన పార్టీకి చెందిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ శెభాష్ అనిపించుకుంటున్నారు. ఆయన సమక్షంలోనే అనుచరులు దూకుడు ప్రదర్శించగా.. ఆయన తన ద్వారా తప్పు జరిగిపోయిందని, తప్పు తెలుసుకున్నానని, క్షమాపణ చెబుతున్నానని అన్నారు. పంతం నానాజీ కి ఉన్న పట్టువిడుపులు రాజకీయ నాయకులు అందరికీ ఉంటే ఈ సమాజం ఎంతో బాగుంటుందని ప్రజలు అంటున్నారు.

కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నారు. మెడికల్ కాలేజీ ఆవరణలో వాలీబాల్ ఆడుకోవడానికి సంబంధించి కాలేజీ వర్గాలతో వివాదం వచ్చింది. ఎమ్మెల్యే తన అనుచరులతో కాలేజీకి వెళ్లి అక్కడి వైద్యుడి పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఆయన సమక్షంలోనే అనుచరులు డాక్టరుపై దాడిచేసి కొట్టారు. నానా మాటలు అన్నారు. దళిత డాక్టరుపై జనసేన ఎమ్మెల్యే దురుసు ప్రవర్తన సర్వత్రా విమర్శలకు దారితీసింది.

ఈలోగానే పంతం నానాజీ.. ఏమాత్రం అహంకారం లేకుండా.. తన తప్పును ఒప్పునకున్నారు. ఆవేశంలో తప్పుగా మాట్లాడానని, ఆ డాక్టరుకు క్షమాపణ కూడా చెప్పారు. ఆ సమయంలో తాను అలా చేసి ఉండాల్సింది కాదని అంటున్నారు. తాను చేసిన తప్పుకు పరిహారంగా తన ఇంటి ఆవరణలో ఒకరోజు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నట్టుగా కూడా పంతం నానాజీ వెల్లడించారు.

మొత్తానికి తిరుమల లడ్డూ విషయంలో జగన్ సర్కారు చేసిన ద్రోహానికి పవన్ కల్యాణ్ 11 రోజులు ప్రాయశ్చిత్త చేస్తుండగా.. ఆ స్ఫూర్తి అందరికీ అంటుకున్నట్టుగా ఉంది. ఎందుకంటే.. ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యే నానాజీ కూడా తన ద్వారా జరిగిన తప్పునకు పరిహారంగా ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. ఈ స్ఫూర్తి నాయకులందరిలోనూ ఉండాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories