షర్మిల వ్యూహం.. జగనన్న జట్టునుంచే మద్దతు!

వైఎస్ షర్మిల కడప ఎంపీ ఎన్నికల బరిలో నెగ్గడానికి బహుముఖ వ్యూహంతో ముందుకెళుతున్నారు. సిటింగ్ ఎంపీ, వైసీపీ తరఫున పోటీచేస్తున్న అవినాష్ రెడ్డిని.. తన చిన్నాన్న వివేకానందరెడ్డిని చంపిన హంతకుడు- కాబట్టి అవినాష్ ను రెండోసారి చట్టసభలో అడుగుపెట్టకుండా చూడడం తన లక్ష్యం అంటూ షర్మిల అడుగడుగునా తన ప్రసంగాల్లో చెబుతున్నారు. కడప ఎంపీ నియోజకవర్గం పరిధిలోని ఓటర్లలో వివేకా హత్య గురించి అసలు సంగతులను వెల్లడించడం ద్వారా.. వారి ఆలోచన మార్చి తాను  గెలవాలనేది ఆమె ప్రయత్నం.

అదొక్క వ్యూహంతో ఆమె ఊరుకోవడం లేదు. వివేకా కూతురు సునీతను కూడా పూర్తిస్థాయిలో ప్రయోగిస్తున్నారు.
సునీతా రెడ్డి దాదాపుగా ఎన్నికల ప్రచారంలో ప్రతిరోజూ షర్మిల వెంట పాల్గొంటున్న సంగతి అందరికీ తెలిసిందే. తన తండ్రిని చంపిన వారికి శిక్ష పడే వరకు తాను నిద్రపోనని, అవినాష్ రెడ్డిని, జగన్ రెడ్డిని ఓడించాలని ఆమె సింగిల్ పాయింట్ ఎజెండాతో షర్మిలకు ప్రచారంలో సహకరిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు కాగా.. ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల నుంచి కూడా తన పోరాటానికి మద్దతు కోరడం విశేషం.

సునీతా రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గంలో కీలకంగా ఉన్న నాయకులను కూడా వారి ఇళ్లకు వెళ్లి కలుస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో తాను ఎంపీగా గెలిచేందుకు మద్దతు ఇవ్వాలని ఆమె వారిని కోరుతున్నారు. ఇవి కూడా కొంతమేరకు షర్మిలకు అనుకూలంగా పనిచేసే అవకాశం ఉన్నదని పలువురు అంచనా వేస్తున్నారు.

సునీతా తాజాగా పులివెందుల నియోజకవర్గం పరిధిలోని వేంపల్లెలో ఉన్న మాజీ ఎమ్మెల్సీ సతీష్ కుమార్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు రవికుమార్ రెడ్డి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు ఎస్.ఎఫ్. బాషా నివాసాలకు వెళ్లారు. సునీత పులివెందుల పరిధిలోని ఇంటింటికీ వెళ్లి.. తన తండ్రిని ఎంత దారుణంగా చంపారో, తనకు ఎలాంటి అన్యాయం జరిగిందో వివరిస్తున్నారు. అదే క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలను కూడా కలిసి ఆమె మద్దతు అభ్యర్థించడం..

షర్మిలకు అనుకూలంగా ఎన్నికల్లో పనిచేయాలని, ఆమెను గెలిపించాలని కోరడం విశేషమే. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో టెక్నికల్ గా ఉన్నప్పటికీ.. అందరూ వైస్ రాజశేఖర రెడ్డి భక్తులే కాబట్టి.. వివేకా హత్య అనే అంశం మీద జరుగుతున్న ఈ ఎన్నికల్లో సునీతకు మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నదని, బహిరంగంగా కాకపోయినా.. తెరవెనుక నుంచి అయినా షర్మిల విజయానికి వైసీపీ నాయకులు పలువురు దోహదం చేయవచ్చునని పలువురు భావిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories