అన్న జగన్మోహన్ రెడ్డికి పీసీసీ సారథి షర్మిల ఒక సరికొత్త ప్రశ్నను సంధించారు. అసలు మీ పార్టీ పేరులోనైనా వైఎస్సార్ ఉన్నారా? అని ప్రశ్నించారు. యువజన శ్రామిక రైతు పార్టీని వైఎస్సార్ పార్టీగా మీరు ప్రజలను మభ్యపెడుతున్నారని, తాను అలాకాకుండా, తండ్రి వైఎస్సార్ పేరుమీదనే పార్టీ ప్రారంభించానని అంటున్నారు. జగన్ పురమాయింపు మీద వైవీసుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామక్రిష్ణారెడ్డి తన మీద చేస్తున్న విమర్శలకు ఆమె గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.
నేను తెలంగాణలో పార్టీ పెట్టానని, తర్వాత ఇక్కడకు వచ్చానని విమర్శిస్తున్నారంటూ.. అక్కడ కేసీఆర్ పతనం కోసమే పార్టీ పెట్టాను. అయినా నా తండ్రి వైఎస్సార్ పేరుతోనే పెట్టాను. మీలాగా ఆ అక్షరాలతో మాయచేసే పార్టీ పెట్టలేదు.. అని షర్మిల నిలదీశారు. మీ పార్టీ పేరులో అసలు వైఎస్సార్ ఎక్కడ ఉన్నారంటూ ప్రశ్నించారు. అక్కడ ఓటు చీలకుండా ఉండేందుకే వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెసులో విలీనంచేశానని, కాంగ్రెస్ పార్టీ బతికి ఉన్నంత వరకు ఆ పార్టీ బతికి ఉంటుందని అన్నారు.
అయినా, సరైన సమయంలో షర్మిల చాలా సహేతుకమైన డిమాండ్ నే లేవనెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ అని ఎవరో పార్టీ ప్రారంభిస్తే ఆ పార్టీని తాను ‘కొనుక్కుని’ తండ్రి పేరుతో స్థాపించిన పార్టీలాగా బిల్డప్ ఇచ్చి తండ్రికి ఉన్న ప్రజాదరణను క్యాష్ చేసుకోవడానికి రాజకీయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వైఎస్సార్ కు ఉండే ప్రజాదరణ మొత్తం తన సొంతం చేసుకోవడానికి ఆయన అన్ని రకాల మార్గాలను వాడుకున్నారు. సాక్షి పేపర్లో లోగో పక్కనే తండ్రి ఫోటో పెట్టారు. ప్రతిరోజూ తండ్రి జీవితం నుంచి ఒక కొటేషన్ వేయడం ప్రారంభించారు. అలాగే సాక్షి టీవీ ఛానెల్ లోగోలో కూడా వైఎస్సార్ బొమ్మ వాడుతూ వచ్చారు. అయితే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. వైఎస్సార్ ను కనుమరుగు చేయడం ప్రారంభించారు.
ముందుగా సాక్షి దినపత్రికలో వైఎస్సార్ కొటేషన్ ను ఇవ్వడం మానేశారు. ఇటీవల సాక్షి చానెల్ లోగో మరియు డిజైన్ మార్చే ప్రక్రియలో భాగంగా.. అసలు వైఎస్సార్ బొమ్మను పూర్తిగా తీసేశారు. వైఎస్సార్ ను పక్కకు నెట్టేసి పూర్తిగా తన సొంత క్రేజ్ నిర్మించుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
షర్మిల మాత్రం చాలా పద్ధతిగా.. అసలు ప్రభుత్వ పథకాల్లోంచి కూడా తండ్రి వైఎస్సార్ పేరును కనుమరుగు చేసేసి.. తన సొంత కీర్తి కోసం జగన్ ఆరాటపడుతున్నారని ఆరోపిస్తున్నారు. పార్టీ పేరులో ఆ అక్షరాలు మిగిలిఉంటాయే తప్ప, తండ్రి వైఎస్సార్ అస్తిత్వాన్ని పూర్తిగా మాయం చేయడానికే జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది.