ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సారథిగా తన అస్తిత్వాన్ని అప్పుడప్పుడూ చాటుకుంటూ ఉండడం.. వైఎస్ షర్మిలకు అత్యవసరమైన పని అయిపోయింది. అసలే ప్రజల్లో ఆమె పార్టీకి ప్రజల్లో విలువలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తడానికి పెద్దగా ఆమెకేమీ లోపాలు కనిపించడం లేదు. పైగా.. రాష్ట్రప్రభుత్వం మీద మాట్లాడడం కంటె.. కనీసం కేంద్రప్రభుత్వాన్ని చికాకు పెట్టగల పనులుచేస్తూ ఉంటే.. తమ పార్టీ అధినేత రాహుల్ దృష్టిలో పడవచ్చుననే ఆశ కూడా ఆమెను నడిపిస్తుంటుంది. ఇలాంటి నేపథ్యంలో ఆమె చాలా తరచుగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం వెంటనే ప్రత్యేకహోదా ఇవ్వాలని, అందుకోసం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పోరాడాలని పసలేని, ప్రయోజనం లేని మాటలు మాట్లాడుతూ ఉంటుంది. ఆ క్రమంలోనే రాష్ట్రంలో షర్మిల నడిపించిన సరికొత్త డ్రామా ఆదిలోనే తుస్సుమంది. విశాఖ ఉక్కు కార్మికులకోసం పోరాడుతానంటూ ఆమె ప్రకటించిన దీక్షను తొలిరోజే భగ్నం చేసి పోలీసులు ఆమెను హైదరాబాదుకు తిప్పిపంపారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంగతి అందరికీ తెలిసింది. ఈ పరిశ్రమను ప్రెవేటు పరం చేయాలని కేంద్రప్రభుత్వం తొలుత ఆలోచన చేసినప్పటికీ.. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం గట్టిగా పట్టుపట్టడం వలన.. ఆ ఆలోచన మానుకుని విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించడం కోసం ప్రత్యేక ప్యాకేజీని కూడా ప్రకటించింది.
అయితే స్వయం సమృద్ధంగా నడపడం కోసం తీసుకునే కొన్ని కఠిన నిర్ణయాల్లో భాగంగా.. కాంట్రాక్టు కార్మికులు రెండువేల మందిని సంస్థ తొలగించింది. కాంట్రాక్టు ఉద్యోగాలు అంటేనే.. పని ఉన్నప్పుడు వారి సేవలను వాడుకుని, పని లేనప్పుడు వారిని ఇంటికి పంపడం చాలా సాధారణమైన సంగతి. కాంట్రాక్టు ఉద్యోగాలనుంచి తొలగిస్తే.. తమ ఉద్యోగాన్ని కొనసాగించి తీరాల్సిందే అని పోరాడడానికి ఎలాంటి న్యాయపరమైన, నైతికమైన హక్కు కూడా ఉండదు. ఎందుకంటే.. సదరు కాంట్రాక్టు ఉద్యోగం ఎప్పుడైనా పోవచ్చునని వారు చేరేటప్పుడే క్లారిటీ ఉంటుంది.
అయితే తొలగించబడిన కాంట్రాక్టు కార్మికుల తరఫున పోరాడడానికి, వారికి తిరిగి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ షర్మిల విశాఖలో దీక్షకు పూనుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఆమె విమానాశ్రయం నుంచి దీక్షాశిబిరానికి చేరుకోగా, రాత్రి 9 గంటల సమయంలో పోలీసులు ఆమె దీక్షను భగ్నం చేశారు. విశాఖనుంచి హైదరాబాదు వెళ్లే విమానంలో బలవంతంగా ఎక్కించి పంపారు.
ప్రయోజనంలేని దీక్షతో ఏదో కాస్త హడావిడి చేయాలని అనుకున్న ఏపీసీసీ సారథి వైఎస్ షర్మిలకు ఈ విషయంలో ఆదిలోనే హంసపాదు ఎదురైనట్లయింది.