ఆస్తుల వివాదంలో వైఎస్ షర్మిల అన్నయ్య జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నారు. తన బెయిలు రద్దు చేయించడం కోసమే చంద్రబాబుతో కలిసి షర్మిల కుట్ర చేస్తున్నారని ఒక అడ్డగోలు వాదనను తెరపైకి తెచ్చి.. ఆస్తుల మీద సంపద మీద తనకు తాపత్రయమే లేదన్నట్టుగా కేవలం బెయిలును కాపాడుకోవడం కోసం మాత్రమే ట్రిబ్యునల్ లో కేసు వేసినట్టుగా బిల్డప్ ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి జవాబు చెప్పలేని ప్రశ్నలకు షర్మిల సంధించారు. జగన్ కోటరీ చెబుతున్న ఈడీ ఎటాచ్ మెంట్ జరిగిన తర్వాత.. ఎప్పుడెప్పుడు ఏయే షేర్ ట్రాన్స్ఫర్లు చేశారో అన్నీ గుర్తు చేస్తున్నారు. అప్పుడంతా జరగని బెయిలు రద్దు ఇప్పుడు మాత్రం జరుగుతుందా? అని ఆమె ప్రశ్నిస్తున్నారు.
జగన్ బెయిలు రద్దుకు కుట్రగా వైసీపీ నేతలు అభివర్ణిస్తుండడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ గా వైఎస్ షర్మిల పేర్కొంటున్నారు. ఈ విషయంలో ఆమె మరింత స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘ఈడీ ఎటాచ్ చేసింది షేర్లు కాదు. 32 కోట్ల రూపాయల విలువైన కంపెనీ స్థిరాస్తిని మాత్రమే. షేర్ల బదలాయింపుపై ఎలాంటి ఆంక్షలు అభ్యంతరాలు లేవు. స్ేటస్ కో ఉన్నది షేర్లపై కానేకాదు. గతంలో కూడా ఎన్నో కంపెనీల ఆస్తులు ఎటాచ్ అయినా స్టాక్ మార్కెట్ లో వాటి షేర్ల ట్రేడింగ్, బదిలీలు యథావిధిగా జరిగాయి. నాకు వందశాతం షేర్లు బదిలీ చేసేలా జగన్ ఎంఓయూపై సంతకం చేశారు. సంతకం చేసినప్పుడు బెయిలు రద్దవుతుందనే సంగతి తెలియదా?’ అంటూ షర్మిల ప్రశ్నిస్తున్నారు.
షర్మిల ప్రశ్నల బాంబులు అక్కడితో ఆగడం లేదు. 2021లో 42 కోట్లకు క్లాసికల్ రియాలిటీ, సండూర్, సరస్వతి షేర్లను విజయమ్మకు ఎలా అమ్మారు? అని ఆమె ప్రశ్నిస్తున్నారు. షేర్ల బదిలీ వల్ల బెయిలు రద్దయ్యేట్లయితే.. అప్పట్లో అమ్మడమే స్టేటస్ కోను ఉల్లంఘించినట్టు అవుతుంది కదా. జగన్ బెయిలు రద్దు, మళ్లీ జెయిలుకు వెళ్లడం అనేది అప్పట్లోనే జరిగి ఉండాలి కదా? అనేది ఆమె ప్రశ్న.
నిజానికి ఇవి షర్మిల చాలా సూటిగా సంధిస్తున్న ప్రశ్నలు. కేవలం ఈ ప్రశ్నలను గమనిస్తే చాలు.. జగన్ కోటరీ మొత్తం బొంకులతో షర్మిల మీద నిందలు వేయడానికి సాహసిస్తున్నదని అర్థమవుతుంది. జగన్ కేవలం ఆస్తుల మీది ఆశతోనే ట్రిబ్యునల్ లో కేసులు వేశారు. పంచిఇచ్చిన వాటిని కూడా తిరిగి తానే చేజిక్కించుకోవాలని అనుకున్నారు. అయితే ఆ ట్రిబ్యునల్ కేసు ద్వారా కూడా తానే సానుభూతి సంపాదించుకోవాలని ఒక వక్రవ్యూహం పన్నారు అనే అభిప్రాయం పలువురికి కలుగుతోంది. జగన్ కోటరీ తరఫున లెక్కకు మిక్కిలిగా మీడియా ముందుకు వస్తున్న ప్రముఖులు షర్మిల తాజా ప్రశ్నలకు ఏం జవాబు చెప్తారో చూడాలి.