విజయసాయికి తలంటుపోసేసిన షర్మిల!

జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం ఆరాటపడిపోయే అగ్ర నాయకులు ఒక్కరొక్కరుగా తెరమీదకు వస్తున్నారు.. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వారి కుటుంబ ఆస్తుల పంపకాల విషయంలో ఎలాంటి నిర్ణయం ఆయన ద్వారా జరిగిందో అవగాహన ఉండగల నాయకులు.. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాపకం కోసం అబద్ధాలు చెబుతూ షర్మిలను ఆడిపోసుకుంటూ మీడియా ముందుకు రావడం గమనార్హం.

జగన్మోహన్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా చెల్లెలి మీద విమర్శల దాడి చేయడానికి రోజుకొక కీలక నాయకుడిని, అదేవిధంగా పెద్ద సంఖ్యలో ఇతర నాయకులను మోహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. నిన్నటికి నిన్న వైవి సుబ్బారెడ్డి- షర్మిలను నిందిస్తూ ఆమె తప్పు చేస్తున్నారని సుదీర్ఘంగా ప్రెస్ మీట్ పెట్టగా.. ఇవాళ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి హైదరాబాదులోనే ప్రెస్ మీట్ నిర్వహించి షర్మిల మీద ఒక రేంజిలో విమర్శలు గుప్పించారు.

అయితే షర్మిల ఏమీ తగ్గడం లేదు. వారి విమర్శలకు జడుసుకోవడం లేదు. అంతే ఘాటుగా విజయసాయిరెడ్డికి షర్మిల తలంటు పోయడం విశేషం. జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగడానికి అలవాటు పడిన మీరు తనమీద అబద్ధాలతో నిందలు వేస్తున్నారు అంటూ షర్మిల విరుచుకుపడ్డారు.

ఆస్తుల్లో నలుగురు చిన్న బిడ్డలకు సమాన వాటా ఉంటుందన్న వైఎస్ఆర్ మాండేట్ అబద్ధం అని మీ బిడ్డల మీద మీ ప్రమాణం చేసి చెప్పగలరా? అని విజయసాయిరెడ్డిని షర్మిల సూటిగా ప్రశ్నిస్తున్నారు. మీరు చదివింది జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ కాదని చెప్పగలరా? ప్రమాణం చేయగలరా? అని  నిలదీస్తున్నారు! వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణానికి కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు కారణం అంటూ విజయసాయిరెడ్డి అడ్డగోలుగా నింద వేస్తే ముమ్మాటికి కాంగ్రెస్ కారణం కానేకాదని ఆమె ఖండిస్తున్నారు.

చనిపోయిన తర్వాత చార్జిషీట్లో వైయస్సార్ పేరు చేర్పించడం ద్వారా ఆయనకు ద్రోహం చేసింది జగన్మోహన్ రెడ్డి అని షర్మిల దెప్పిపొడుస్తున్నారు. తన సొంత ప్రయోజనాల కోసం తల్లిని కూడా కోర్టు కీడ్చిన జగన్మోహన్ రెడ్డి విషపు నాగు లాంటివాడని ఆమె అంటున్నారు. చంద్రబాబును తన బిడ్డ పెళ్లికి ఆహ్వానిస్తే దానికి కూడా విపరీత అర్ధాలు తీసే మీలాంటి వాళ్లకు సంస్కారం ఉందని ఎలా అనుకోవాలి అంటూ ఆమె విజయసాయిరెడ్డిని కడిగిపారేశారు.

జగన్మోహన్ రెడ్డి అద్దంలో చూసుకున్నా కూడా ఆయనకి చంద్రబాబు కనిపిస్తూ ఉంటారేమోనని.. ఆ పిచ్చి లోంచి ఆయన బయటకు రావాలని షర్మిల హేళన చేయడం విశేషం.

Related Posts

Comments

spot_img

Recent Stories