వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా రాజ్యం చేస్తున్న రోజులలో రాష్ట్రంలో ఉండే ప్రతి బిడ్డకు తానే మేనమామను అని చాటుకున్నారు. అమ్మఒడి పథకం ద్వారా అల్లుళ్ళ ఖాతాలకు డబ్బులు ఇస్తున్నారు కనుక- సొంత ఆస్తులు పంచి ఇచ్చిన స్థాయిలో రాష్ట్రంలో ఉండే పిల్లలందరికీ ఉమ్మడిగా మేనమామ హోదాను ఆయన కోరుకున్నారు. కానీ వాస్తవానికి వచ్చేసరికి సీన్ రివర్స్ లో కనిపిస్తోంది. హక్కుగా వారికి దక్కవలసిన ఆస్తులలోనూ ఒక్క పైసా అయినా ఇవ్వకుండా సొంతమేనల్లుడు, మేనకోడళ్లను వంచిస్తున్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో మిగిలిపోతున్నారు. తాజాగా ఆయన సొంత చెల్లెలు వైఎస్ షర్మిల మాటలను గమనిస్తే ఎవరికైనా సరే ఇలాంటి అభిప్రాయమే కలుగుతుంది.
వైయస్ జగన్మోహన్ రెడ్డి సరస్వతీ పవర్ షేర్ల వ్యవహారంలో ఎంత రాద్ధాంతం చేస్తున్నారో అందరికీ తెలుసు. కన్నతల్లి విజయమ్మకు గిఫ్ట్ డీడ్ ద్వారా ఇచ్చిన షేర్లను కూడా తనకు తిరిగి ఇవ్వాలని కోరుతూ ఆయన ట్రిబ్యునల్ లో కేసులు నడుపుతున్నారు. తల్లి మీద తనకు ప్రేమాభిమానాలు ఉండే రోజులలో షేర్లను గిఫ్ట్ డీడ్ గా ఇచ్చానని, ఇప్పుడు తమ మధ్య అలాంటి ప్రేమలేమీ లేవు గనుక తన షేర్లు తనకు వెనక్కు ఇవ్వాలని ఆయన లీగల్ గా డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తల్లి విజయమ్మ చెల్లెలు షర్మిల ఒకవైపు.. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య భారతి మరొకవైపుగా న్యాయపరమైన యుద్ధం ఆస్తుల కోసం నడుస్తోంది. కాగా తాజాగా మీడియా ముందుకు వచ్చిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇప్పటివరకు ఒక్క ఆస్తి కూడా జగన్ తనకు ఇవ్వలేదని నొక్కి వక్కాణిస్తున్నారు. కన్నతల్లికి ఇచ్చిన షేర్లని తిరిగి కావాలని కోరడం ద్వారా విజయమ్మను జగన్ మోసం చేశారని షర్మిల అంటున్నారు. తల్లి పై కేసు వేసిన కొడుకుగా.. మేనల్లుడు, మేనకోడలు ఆస్తులు కాజేసిన మేనమామగా చరిత్రలో నిలిచిపోతారని షర్మిల తీవ్రంగా విమర్శించడం గమనార్హం. జగన్మోహన్ రెడ్డికి విశ్వసనీయత ఉన్నదో లేదో ఆ పార్టీ నాయకులే ఆలోచించుకోవాలని షర్మిల హితవు చెబుతున్నారు.
మొత్తానికి తల్లికి ఇచ్చిన షేర్లు వెనక్కు కావాలని దావా నడుపుతున్న జగన్మోహన్ రెడ్డికి ట్రిబ్యునల్ ద్వారా శుభవార్త వస్తుందో లేదో గాని.. ఆ సంగతి తేలేలోగా, తల్లిని చెల్లిని మోసం చేసిన వ్యక్తిగా ఆయన పరువు మొత్తం గంగలో కలిసిపోతుందని పలువురు అంటున్నారు. ఇప్పటికే ఆయన పిటిషన్ కు కౌంటర్ గా వైయస్ విజయమ్మ సరస్వతి పవర్ కంపెనీలో షేర్లు పూర్తిగా తనకే చెందుతాయని.. జగన్మోహన్ రెడ్డికి గాని, వైయస్ భారతి కి గాని ఎలాంటి హక్కు అధికారం లేవని పేర్కొనడం గమనించాల్సిన సంగతి.