వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ మీట్ లలో ఎన్నెన్ని అబద్ధాలు చెబుతూ ఉంటారో.. ప్రజలను ఎన్ని రకాలుగా మభ్యపెట్టాలని, మోసం చేయాలని చూస్తుంటారో వారికి వివరించి చెప్పడానికి ప్రత్యేకంగా అధికారంలో ఉన్న రాజకీయ ప్రత్యర్థులు అక్కర్లేదు. వారికంటె చాలా విపులంగా ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల ఆయన బండారం మొత్తం బయటపెడుతుంటారు. అదానీ ముడుపుల వ్యవహారంలో అసలు తప్పేమీ జరగలేదని ప్రజలను నమ్మించడానికి, ఎఫ్బిఐ నివేదికలో తన ప్రస్తావన ఏమీ లేదని బుకాయించడానికి జగన్ ప్రెస్ మీట్ పెడితే.. ఆయన మాట్లాడిన మాటలనే ఒక్కటొక్కటిగా తిప్పకొడుతూ.. వైఎస్ షర్మిల ఉతికి ఆరేస్తున్నారు.
సంపద సృష్టి ద్వారా తాను చరిత్ర సృష్టించానని జగన్మోహన్ రెడ్డి అంటే.. అదానీతో 1750 కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్న జగన్ ఒప్పందం రాష్ట్రంలో మాత్రమే కాదు, అంతర్జాతీయంగా కూడా చరిత్రే అని షర్మిల అంటున్నారు.
జగన్ కోరుకుంటున్నట్టుగా ఆయనను సన్మానించాల్సిందేనని, అయితే ఆయన అన్నట్టుగా సంపద సృష్టికి కాకుండా.. యూనిట్ కు 50 పైసలు ఎక్కువ పెట్టి కొన్నందుకు, ఆ ఒప్పందాలను ఆగమేఘాల మీద పూర్తిచేసుకున్నందుకు ఆయనను సన్మానించాలని ఆమె ఎద్దేవా చేస్తున్నారు. అసలు ముఖ్యమంత్రిని వ్యాపారవేత్తలు గోప్యంగా కలవడం ప్రపంచంలో ఎక్కడా జరగదని కూడా ఆమె చెబుతున్నారు.
ఎవరూ కొనని విద్యుత్తును బంపర్ ఆఫర్ గా ప్రకటించుకోవడం ఒక చరిత్రే అని, గంటల్లోనే కేబినెట్ సమావేశం పెట్టడం కూడా చరిత్రే అని ప్రజాభిప్రాయం లేకుండా ఒప్పందాలకు ఆమోదం తెలపడం కూడా చరిత్రే అని షర్మిల ఎద్దేవా చేస్తున్నారు. రాష్ట్ర ప్రజల మీద 1.67 లక్షల కోట్ల భారాన్ని మోపడమే జగన్మోహన్ రెడ్డి చరిత్ర అని ఆమె ప్రశ్నిస్తున్నారు.
ఎఫ్బిఐ నమోదు చేసిన కేసులో తన పేరు లేదని, ఆ నివేదికలో కూడా తన పేరు లేదని జగన్మోహన్ రెడ్డి వాదిస్తున్నారు. అయితే ఎఫ్‌బిఐ నివేదికలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అని స్పష్టంగా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దాని అర్థం జగన్మోహన్ రెడ్డి అనే కదా అని షర్మిల ప్రశ్నిస్తున్నారు. విద్యుత్తు ఒప్పందాల రూపంలో మాత్రమే కాదు.. గంగవరం పోర్టును కేవలం 640 కట్లకే జగన్ అమ్మేశారని, రాష్ట్రాన్ని బ్లాంక్ చెక్కులా అదానీకి కట్టబెట్టేశారని ఆమె ఆరోపిస్తున్నారు.
అన్నింటినీ మించి.. అదానీ వల్ల ఆర్థిక లబ్ధి పొందలేదు అని జగన్ తన బిడ్డల మీద ప్రమాణం చేయగలరా? అని చెల్లెమ్మ షర్మిల సవాలు విసురుతున్నారు. ఇది జగనన్నకు వినిపిస్తుందో లేదో మరి.