కౌంటర్లు ఇచ్చే కొద్దీ చెలరేగిపోతున్న షర్మిల!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధినేత మళ్లీ ఒక్కచాన్స్ ముఖ్యమంత్రి అయితే చాలు.. ఇంకో ముప్పయ్యేళ్ల పాటు ముఖ్యమంత్రి పీఠం మీద నుంచి తనను ఎవ్వరూ కదలించలేరు అనే ఆశితో అడుగులు వేస్తున్న జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ షర్మిల తన మాటల బాణాలతో భయం పుట్టిస్తున్నారు.  చిన్నాన్న వివేకానందరెడ్డి హంతకులు మళ్లీ పార్లమెంటులో అడుగుపెట్టకుండా అడ్డుకోవడానికి, హంతకులకు మద్దతు ఇస్తున్న అన్న జగన్మోహన్ రెడ్డి అరాచకాలను ప్రశ్నించడానికి మాత్రమే తాను కడప ఎంపీ సీటు నుంచి పోటీచేస్తున్నాలని షర్మిల గట్టిగానే చెబుతున్నారు. చెల్లెళ్లను తనమీదికి చంద్రబాబునాయుడు ఉసిగొల్పారని జగన్ చెబుతున్న మాటలు పెద్దగా పనిచేయడం లేదు. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డిని కాపాడుకోవడానికి, తమ అనుచరులు, సలహాదారుల ద్వారా షర్మిల మీద విమర్శలు చేయిస్తున్నారు జగన్. అయితే.. తనకు జగన్ పార్టీనుంచి కౌంటర్లు వస్తున్న కొద్దీ.. షర్మిల మరింతగా చెలరేగిపోతుండడం గమనార్హం.

వివేకానందరెడ్డి హత్యలో అవినాష్ రెడ్డి ప్రమేయం ఏమీ లేనేలేదని, వివేకా హత్య తరువాత ఎర్ర గంగిరెడ్డి రక్తపు మరకలను తుడిచేస్తూ ఉంటే అవినాష్ రెడ్డి కేవలం చూస్తూ పక్కన నిల్చున్నాడని.. షర్మిల మేనమామ రవీంద్రనాధ్ రెడ్డి ఆయనకు కితాబు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి షర్మిల ఒక రేంజిలో కౌంటర్ ఇచ్చారు.

నెత్తుటిమరకలు తుడిచేస్తోంటే చూస్తూ నిల్చోవడానికి అవినాష్ ఏమైనా పాలుతాగే పసిబిడ్డా అని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఎంపీ గా పోటీచేయాలనుకుంటున్న వ్యక్తికి ఆమాత్రం తెలియదా అని అంటున్నారు. తెలంగాణను వదిలేసి తాను ఇక్కడకు వచ్చానని మేనమామ రవీంద్రనాధ్ రెడ్డి అన్నందుకు.. ‘అక్కడ కేసీఆర్ ను ఓడించానని, ఏపీలోనూ జగన్ ను ఇంటికి పంపడానికే ఇక్కడకు వచ్చానని’ షర్మిల కౌంటర్ ఇవ్వడం గమనార్హం.

జగన్ తరఫున ఆయన వాయిస్ ను వినిపిస్తూ ఉండే సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ వివేకానందరెడ్డి హత్య వ్యక్తిగత వ్యవహారం అంటూ చేసిన వ్యాఖ్యలపై కూడా షర్మిల ఫైర్ అయ్యారు. సీఎంగా చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి తమ్ముడు, మాజీ ఎంపీ, మాజీ మంత్రి దారుణంగా హత్యకు గురైతే అది వ్యక్తిగత విషయమా? అని ఆమె కౌంటర్ ఇచ్చారు.

మొత్తానికి బంతిని నేలకేసి కొడితే.. అది ఆకాశానికేసి ఎగిరినట్టుగా షర్మిలతో వ్యవహారం వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా పరిణమిస్తోంది. ఆమె విమర్శలను పట్టించుకోకుండా ఉంటే నష్టం తప్పదు. అలాగని.. వాటికి పార్టీ నాయకులతో కౌంటర్లు ఇప్పిస్తే ఆమె మరింతగా రెచ్చిపోతూ ఆ కౌంటర్లను కూడా ప్రచారానికి వాడుకుంటూ చెలరేగుతున్నారు. షర్మిల విషయంలో వైసీపీ ఇరకాటంలో పడుతున్నదని ప్రజలు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories