జగన్‌కు సరైన కౌంటరివ్వగలిగేది షర్మిలనే!

జగన్మోహన్ రెడ్డి మీద నిశిత విమర్శలతో విరుచుకుపడాలంటే.. అది అధికార కూటమి నాయకులకు కూడా సాధ్యం కావడ లేదు గానీ.. ఆయన సొంత చెల్లెలు షర్మిల ఆ పాత్రను చాలా బాగా పోషిస్తుంటారు. రాజకీయ వైరం ఉన్న అధికార కూటమి నాయకులందరూ.. జగన్ ను నిందించే లేదా తిట్టే తీరు ఒక రకంగా ఉంటుంది. కానీ షర్మిల ఆయన మీద చేసే విమర్శలు నిప్పులు చెరగుతున్నట్టుగా ఉంటాయి. చాలా తీవ్రంగా ధ్వనిస్తాయి. ఇప్పుడు కూడా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కుక్కల విద్యాసాగర్‌కు- ముంబాయి హీరోయిన్ కాదంబరి జత్వానీకి మధ్య వ్యవహారంలో షర్మిల మాటలు జగన్ కు చెంపపెట్టులాగానే ఉన్నాయి. 

నిజానికి ఇది.. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి సంబంధించిన ప్రెవేటు గొడవ. వారిద్దరి పంచాయతీ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చక్రం తిప్పే పెద్దల వద్దకు చేరింది. వారు పోలీసుల్ని పురమాయించి.. ఎక్కడో ముంబాయిలో సినిమాలు చేసుకుంటూ ఉంటే అమ్మాయి కదా.. మన అధికారం దెబ్బ ఎలా ఉంటుందో రుచిచూపిద్దాం అనుకున్నారు. కొన్ని నెలలకే అధికారం చేతులు మారిన తర్వాత.. వారి బాగోతం మొత్తం బయటకు వచ్చింది. మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం.. సజ్జల రామక్రిష్ణారెడ్డి మొత్తం వ్యవహారాన్ని తెరవెనుక నుంచి నడిపించారు. నిజానిజాలు పోలీసు విచారణలో తేలే అవకాశం ఉంది. 

అయితే ఇప్పటిదాకా ఈ విషయంలో విపక్ష నాయకులు కూడా సజ్జల పాత్ర గురించి, వైసీపీ భక్త పోలీసు అధికారుల పాత్ర గురించి చాలా మాట్లాడారు గానీ.. నేరుగా ఈ వ్యవహారానికి ముడిపెట్ట జగన్ మీద ఎటాక్ కు దిగలేదు. కానీ.. షర్మిల ఏమాత్రం తగ్గడం లేదు. ముఖ్యమంత్రి జగన్ కు తెలియకుండా ఇంత పెద్ద సెటిల్మెంట్ జరుగుతుందా? అని ఆయన పాత్రనే ప్రశ్నిస్తున్నారు. కాదంబరితో ముడిపడి మరో వివాదంలో ఉన్నటువంటి సజ్జన్ జిందాల్ తో జగన్ తన సాన్నిహిత్యాన్ని గొప్పగా చెప్పుకున్నారు కదా.. ఆయనే ఈ వ్యవహారాన్ని నడిపించి ఉంటారని, ఆయనకు తెలియకుండా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ముందుకెళ్లరు కదా అని  అంటున్నారు. 

జగన్ కు కూడా ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు కదా.. కనీస మానవత్వం లేకుండా జగన్ మరో ఆడబిడ్డకు ఇలాంటి అన్యాయం ఎలా చేయగలిగారు? అని షర్మిల ప్రశ్నిస్తున్నారు. కాదంబరికి మద్దతుగా తాను స్వయంగా పోరాటానికి దిగడానికి కూడా సిద్ధం అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories