వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి ఆరేళ్లు గడచిపోతున్నాయి. ఇప్పటిదాకా ఆ కేసు ఒక కొలిక్కి రావడం లేదు. రకరకాల పీటముడులు పెడుతూ.. అసలు కేసు దర్యాప్తు ముందుకు సాగనివ్వకుండా అడ్డుపడుతున్నవారు అనేకమంది ఉన్నారు. ఒకవైపు తన తండ్రిని ఎవరు హత్య చేశారో తేల్చాలని ఆయన కూతురు సునీత, న్యాయస్థానాల ద్వారా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. మరోవైపు ఆ కేసులో సాక్షులుగా ఉన్న వారందరూ ఒక్కరొక్కరుగా మరణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ చెల్లెలు, తొలినుంచి కూడా వివేకా హత్య కేసు దర్యాప్తు గురించి గట్టిగా తన గళం వినిపిస్తున్న పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా మరో కొత్త పాయింట్ జత చేస్తున్నారు. తమ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో సంఘటన స్థలంలో ఉన్నది అవినాష్ రెడ్డే.. అని ఆమె తేల్చి చెబుతున్నారు.
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిలు మీద బయట ఉన్న కారణంగానే.. ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదని, ఏ సంగతి తేలడం లేదని అర్థం వచ్చేలా షర్మిల వ్యాఖ్యలు ఉండడం గమనార్హం. నిందితుడు అవినాష్ రెడ్డి.. బెయిలుపై బయట ఉండి సాక్షులను బెదిరిస్తున్నారని, అందరూ ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపించారు. అదే సమయంలో.. వివేకా కుమార్తె సునీతకు ఇద్దరు పిల్లలున్నారని, ఆమె ప్రాణాలకు కూడా రక్షణ లేదని.. కేసులో అసలు నిందితులు సునీతను ఏమైనా చేస్తారనే భయం కూడా తమకు ఉన్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల రాష్ట్రప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో గతంలో విచారణాధికారులను అవినాష్ రెడ్డి తన ఇంటికి పిలిపించుకుని బెదిరించినట్లుగా పేర్కొన్న సంగతి కూడా తెలిసిందే. ఈ అఫిడవిట్ ను కూడా షర్మిల ప్రస్తావిస్తున్నారు. తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు రిపోర్టులపై అధికారులను బెదిరించి మరీ అవినాష్ సంతకాలు చేయించారేని, ఆయన బెయిలు మీద బయట ఉన్నంత కాలమూ.. సునీతకు న్యాయం జరగదని అంటున్నారు.
వివేకాను ఆయన కూతురు సునీత, అల్లుడు రాజశేఖర రెడ్డి చంపించినట్లుగా తప్పుడు రిపోర్టులు ఇచ్చారని ఆరోపిస్తున్న షర్మిల.. ఇవన్నీ అవినాష్ రెడ్డి బెయిలు మీద బయట ఉన్నందువల్లే జరుగుతున్నాయని అనడం విశేషం. హత్య సమయంలో ఘటనాస్థలంలో అవినాష్ రెడ్డే ఉన్నారని కూడా ఆమె అంటున్నారు.
ఏదైతే తప్పుడు రిపోర్టు అని షర్మిల అంటున్నారో.. అదే నిజమన్నట్టుగా.. ఇటీవలి హత్య అనే టైటిల్ తో సినిమా వచ్చిన సంగతి కూడా తెలిసిందే. ఈ సినిమాలో ఈ హత్య కేసుతో ముడిపడ్డ అందరు వ్యక్తులను గుర్తుచేసేలా పాత్రలను సృష్టించి.. హత్య మాత్రం సునీత- రాజశేఖర రెడ్డి చేయించినట్టు తీర్మానించారు. అయితే ఆ సినిమాలో షర్మిల పాత్రను చూపించలేదు. ఆమె ఈ హత్య గురించి తొలినుంచి పోరాడుతున్నా.. పాత్ర ప్రస్తావన లేకపోవడం గమనించాలి.