జగన్మోహన్ రెడ్డికి ఉన్న ‘గుర్తింపు సమస్య’ అనేది ఒక మానసికమైన బలహీనత. తాను చేసిందేమీ లేకపోయినా.. తన పేరు, తన బొమ్మ చిరస్థాయిగా ఉండిపోవాలని ఆయన అనుకుంటారు. అలా కోరుకునే వ్యక్తి తన సొంత డబ్బుతో నలుగురికి ఇళ్లు నిర్మించి ఇచ్చి వాటి మీద తన బొమ్మను వేయించుకుంటే ఒక రకంగా ఉంటుంది. అలా కాకుండా.. ప్రజలు తాతలకాలంనుంచి వస్తున్న ఆస్తుల చుట్టూ సరిహద్దు రాళ్లు రాటి వాటి మీద తన బొమ్మ వేయించుకోవాలని ఆశపడే వైఖరి జగన్ ది. వారి తాతల కాలం నాటి ఆస్తులకు పట్టాలు ఇస్తూ వాటిమీద తన బొమ్మ వేయించుకునే తీరు ఆయనది. అలాంటి జగన్ పేరు పిచ్చికి.. విజయవాడలో కొందరు సరైన రీతిలోనే బుద్ధి చెప్పారు. అయితే.. అదేదో అంబేద్కర్ మీద దాడి జరిగినట్టుగా మసిపూసి మారేడు కాయచేసి రాజకీయంగా లబ్ధి పొందడానికి జగన్మోహన్ రెడ్డి అనుచిత మార్గాలను అనుసరిస్తుండడమే ఇప్పుడు తమాషా.
విజయవాడలో జగన్ సర్కారు నిర్మించిన అంబేద్కర్ విగ్రహం వద్ద శిలాఫలకంపై జగన్ పేరును కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారు. అంబేద్కర్ లాంటి మహనీయుడి వద్ద అదేదో జగన్ దయ అన్నట్టు ఆయన పేరు ఎందుకనే కోపంతో అంబేద్కర్ అభిమానులు ఎవరైనా ఆ పనిచేసి ఉండొచ్చు. విద్యాదీవెన వంటి పథకానికి అంబేద్కర్ పేరు తొలగించి తన పేరు పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి వైఖరితో విసిగి ఆగ్రహించి.. అలాంటి జగన్ పేరు అంబేద్కర్ వద్ద ఉండతగదని ఎవరైనా అలా చేసి ఉండొచ్చు.
కానీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం జగన్ వాడుతున్నారు. అంబేద్కర్ మీద చంద్రబాబునాయుడు దాడి చేయించారంటూ నానా రాద్ధాంతం చేస్తున్నారు. ఈ ఘటనలో అంబేద్కర్ విగ్రహానికి కించిత్తు హాని జరగలేదు. పైగా తాను అధికారంలో ఉండగా.. ప్రతి ప్రభుత్వ కార్యాలయం వద్ద బయట ఏర్పాటు చేసిన బోర్డులపై కూడా జగన్ తన బొమ్మలు వేయించుకున్నారు. ఆఫీసులో సీఎం ఫోటో సహజం. కానీ బయట బోర్డుల్లో కూడా తన బొమ్మ పెట్టుకుని, వాటిని తొలగిస్తే.. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం అంటూ కారుకూతలు కూశారు. అదే క్రమంలో ఇప్పుడు శిలాఫలకంపై తన పేరును ధ్వంసం చేస్తే.. అంబేద్కర్ వంటి మహనీయుడిపై దాడి అంటూ అర్థం పర్థం లేకుండా నానా మాటలు మాట్లాడుతున్నారని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు.