జగన్మోహన్ రెడ్డి భరోసా లేదా పరామర్శ అంటే కేవలం మాటలు మాత్రమేనా? చేతల్లో ఏమీ కనిపించదా? అనే సందేహం ఇప్పుడు ప్రజల్లో కలుగుతోంది. ఎవరు చనిపోయినా, రాష్ట్రానికి విపత్తులు వాటిల్లినా.. జగన్ సాయం పేరుతో, భరోసా పేరుతో ఒక పర్యటన చేస్తారు.. ఆ పర్యటనను తన రాజకీయ మైలేజీకి ఎన్ని రకాలుగా వాడుకోవచ్చునో అన్ని రకాలుగానూ వాడుకుంటారు. అంతే తప్ప.. నిర్దిష్టంగా అవతల నష్టపోయిన వారికి, బాధితులకు ఆయన కార్చే మొసలి కన్నీరు, పలికే కంటితుడుపు మాటలు తప్ప దక్కేదేమీ ఉండదు.. అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. జగన్ పాపిరెడ్డి పల్లి వెళ్లి వచ్చిన తర్వాత ప్రజల్లో ఇలాంటి అభిప్రాయం మరింతగా బలపడుతోంది.
జగన్ పాపిరెడ్డి పల్లె వెళ్లారు. అక్కడ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించారు. వారికి ఏం భరోసా ఇచ్చారు? అనేది ఇప్పుడు ప్రజల సందేహం. వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని అన్నారు. అలాంటివి కేవలం పడికట్టు మాటలు. పార్టీ అండగా ఉండడం అంటే ఏమిటి? వారి కుటుంబ అవసరాలకు పార్టీనుంచి నిధులు సమకూరుస్తారా? లేదా, పార్టీ కార్యకర్త చనిపోయాడు గనుక.. ఏదైనా నిర్దిష్టమైన ఆర్థిక సాయం ఆ కుటుంబానికి అందిస్తున్నారా? అంటే అలాంటిదేమీ లేదు. ఆ కుటుంబాన్ని పరామర్శించే పేరుమీద జగన్ నడిపించిన రాజకీయ డ్రామా కోసం హెలికాప్టర్ లో వెళ్లడానికి పెట్టిన ఖర్చులో కనీసం సగమైనా ఆ కుటుంబానికి ఆర్థిక సాయంగా అందించే ఉద్దేశం కూడా జగన్ పార్టీకి ఉన్నట్టుగా లేదు. ఒక్కరూపాయైనా సాయం ప్రకటించలేదు. అదే సమయంలో.. లింగమయ్య పిల్లలకు ఉద్యోగాలు వచ్చేలా చూస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఆయన ఇప్పించదలచుకున్నది ప్రెవేటు ఉద్యోగాలు అయితే.. ఈ పాటికి ఇప్పించేయాలి. లేదా ప్రభుత్వ ఉద్యోగాలు అయితే.. అది ఎప్పటికి జరగాలి? జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చేది ఎప్పుడు? వారికి ఉద్యోగాలు ఇచ్చేది ఎప్పుడు? అసలు ఎన్నికలు వచ్చేదాకా ఈ పార్టీ మిగిలి ఉంటుందా? అనే సందేహాలే ప్రజల్లో కలుగుతున్న సమయంలో.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఉద్యోగాలు ఇస్తాననడం మోసం కాదా? అనేది పలువురి ప్రశ్న.
అసలు జగన్ కు సాయం చేసే మనస్తత్వమే లేదని పలువురు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో ఏమైనా జరిగిపోనీ.. కార్యకర్తలు ఏమైనా అయిపోనీ.. మాటలు చెబుతారు.. ప్రభుత్వం మీద నిందలు వేస్తారు తప్ప.. తన జేబునుంచి గానీ పార్టీ నుంచి గానీ.. ఒక్కరూపాయి కూడా విదిలించే అలవాటు జగన్ కు లేదు.. అని అంతా అంటున్నారు.
ఇది మొదటిసారి కాదు. గతంలో బెజవాడలో వరదలు ముంచెత్తినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి చాలా ఆర్భాటంగా కోటి రూపాయల విరాళం ప్రకటించారు. కానీ ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా తన, పార్టీ ఖజానా నుంచి బయటకు తీయలేదు. పాలకపక్షం వారు.. పదేపదే నీ కోటి ఎక్కడ.. ఎవరికిచ్చావు.. ఎవరికి ఖర్చు పెట్టావు అని ప్రశ్నిస్తే.. తమ పార్టీ కార్యకర్తలతో కొన్ని చోట్ల మొక్కుబడిగా అన్నదానాలు చేయించి, వాటర్ బాటిళ్లు పంచేలా చేసి.. కోటి రూపాయలు పార్టీ తరఫున ఖర్చు పెట్టినట్టుగా లెక్క చెప్పారు. బెజవాడ వరద సమయంలో.. పసిపిల్లలు దాచుకున్న కిడ్డీ బ్యాంకు సొమ్ములను కూడా విరాళంగా ఇచ్చారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి తను సొంతంగా గానీ, తన వ్యాపార సంస్థలు సాక్షి, భారతి సిమెంట్స్ వంటి వాటి ద్వారా గానీ.. ఒక్క రూపాయైనా విదిలించకపోగా.. పార్టీ తరఫున అని ప్రకటించిన కోటి కూడా ఇవ్వకపోవడం అతని బుద్ధికి నిదర్శనం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.