విభజన హామీల గురించి చర్చించుకుందామా…తెలంగాణ సీఎంకి ఏపీ సీఎం లేఖ!

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు కావొస్తుంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని శాఖాలు విభాగాల్లోని పనులు పరుగులు పెట్టిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇప్పటికే ఎన్నికల హామీల్లో ఇచ్చిన పెన్షన్ల పెంపు కార్యక్రమాన్ని జులై 1 న ఊరురా పెద్ద పండగలా నిర్వహించారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి లేఖ రాయడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.

తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన విభజన హామీలను గురించి చంద్రబాబు లేఖలో వివరించారు. విభజన సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 6వ తేదీన హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేయాలని రేవంత్‌రెడ్డికి చంద్రబాబు లేఖలో సూచించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు దాటినా విభజన చట్టం అమల్లో భాగంగా ఉత్పన్నమైన సమస్యలపై చర్చలు జరిగినా కొన్ని అంశాలు ఇంకా పరిష్కారం కాలేదని బాబు వివరించారు. పరస్పర సహకారం తెలుగు ప్రజల అభ్యున్నతికి తోడ్పడుతుందని చంద్రబాబు అన్నారు.

ఉమ్మడి అంశాల సామరస్య పరిష్కారానికి ఎదురుచూస్తున్నట్లు ఆయన లేఖలో  వివరించారు. తెలుగు రాష్ట్రాల సంక్షేమం, పురోగతికి దోహదపడేలా ముఖ్యమైన సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని రేవంత్ కి రాసిన లేఖలో బాబు అభిప్రాయపడ్డారు. తెలంగాణ అభివృద్ధి, ప్రగతికి రేవంత్‌రెడ్డి చేస్తున్న కృషిని చంద్రబాబు ప్రశంసించారు. రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముఖాముఖి ద్వారా కీలక అంశాలను పరిష్కరించుకునేందుకు వీలుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ చర్చలు మంచి ఫలితాలిస్తాయనే నమ్మకం ఉందని లేఖలో చంద్రబాబు తెలిపారు.

రెండు రాష్ట్రాల మధ్య సుస్థిర ప్రగతి సాధించడానికి పరస్పర సహకారం అవసరమని చెప్పారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఇది మన బాధ్యత అని చంద్రబాబు అన్నారు. ప్రజల అభ్యున్నతికి దోహదపడేలా ఉమ్మడి లక్ష్యాలను సాధించడంలో ఈ భేటీ కీలకం అని బాబు తెలిపారు.

గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సీఎం రేవంత్‌!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాసి.. రాష్ట్ర విభజన సమస్యలపై చర్చిద్దామని, ముఖాముఖి భేటీతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని.. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అయినా కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయని లేఖలో చంద్రబాబు గుర్తు చేశారు. ఇందుకోసం ఈ నెల 6వ తేదీన ఫేస్ టూ ఫేస్ భేటీ అయ్యి ఈ అంశాలపై చర్చిద్దామని రేవంత్ ని చంద్రబాబు కోరడంతో…దానికి తెలంగాణ సీఎం సానుకూలంగా స్పందిచినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో చంద్రబాబు విజ్ఞప్తికి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు చంద్రబాబుకు సీఎం రేవంత్ మంగళవారం తిరిగి లేఖ రాయనున్నారు. చంద్రబాబు విజ్ఞప్తికి రేవంత్ సానుకూలంగా స్పందించడంతో ఈ నెల 6వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ జరగనుంది.

హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ఈ సమావేశంలో రాష్ట్ర విజభన అంశాలు, కొన్ని సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా ఉన్న అపరిష్కృత విషయాలపై ఇద్దరు చర్చించనున్నట్లు సమాచారం. కాగా, తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. రెండు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. రాజకీయాల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని చంద్రబాబు శిష్యుడిగా పిలుస్తుంటారు.

పోయిన సంవత్సరం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో రేవంత్‌ ముఖ్యమంత్రి పీఠం ఎక్కగా, ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు . ఈ క్రమంలో గురు శిష్యులు ఇద్దరూ సీఎంల హోదాలో ఫస్ట్ టైమ్ భేటీ కావడం రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఇంట్రస్టింగ్‌ గా మారింది.

Related Posts

Comments

spot_img

Recent Stories