అవినీతి అక్రమాల కేసుల్లో అరెస్టు అయిన వారు.. పోలీసులు తమను విచారిస్తున్నప్పుడు.. తమకేమీ తెలియదు, తమకు అస్సలు సంబంధం లేదు.. గుర్తులేదు లాంటి సమాధానాలతో బుకాయించి తప్పించుకోవాలని చూడడం ఇటీవలి కాలంలో చాలా సర్వసాధారణం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి పాలన కాలంలో.. సాగిన అనేకానేక అకృత్యాలకు, అవినీతి కార్యకలాపాలు, ప్రజాధనం దోపిడీలకు సంబంధించి.. ఇప్పుడు కేసులు నమోదు అవుతున్నాయి. అయితే విచారణకు వస్తున్న నిందితులు మాత్రం.. ఒకటే స్క్రిప్టును వాడుతున్నారు. ‘తెలియదు గుర్తులేదు మర్చిపోయా’ పదాలు ప్రతి ఒక్కరికీ వేదమంత్రాలుగా మారిపోయాయి. లిక్కర్ కుంభకోణానికి ప్రధాన సూత్రధారిగా, ప్రస్తుతానికి ఏ1 నిందితుడిగా ఉన్న కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి.. పోలీసుల కస్టడీలోకి వచ్చిన తర్వాత కూడా దాదాపుగా ఇదే స్క్రిప్టును అనుసరిస్తున్నారు. ఆల్రెడీ దర్యాప్తులో తేలిన అంశాల ఆధారంగానే సిట్ పోలీసులు ప్రశ్నలు సంధిస్తున్నప్పటికీ.. రాజ్ కెసిరెడ్డి మాత్రం అన్నింటికీ బుకాయింపు సమాధానాలే చెబుతున్నట్టుగా తెలుస్తోంది. ఏడుగంటల పాటు విచారణలో బుకాయింపు జవాబులు చెప్పగలరు గానీ.. ఏకంగా ఏడురోజుల పాటు సాగనున్న విచారణలో ఎంత కాలం బుకాయిస్తూ గడపగలరు.. అని ప్రజలు కూడా అనుకుంటున్నారు.
లిక్కర్ స్కాంలో ఏ1 నిందితుడు కెసిరెడ్డి రాజశేఖర రెడ్డిని సీఐడీ కస్టడీలో ఏడురోజుల పాటు విచారించడానికి కోర్టు అనుమతించింది. ఆయనను తమ అదుపులోకి తీసుకున్న పోలీసులు శుక్రవారం ముందుగా వైద్యపరీక్షలు చేయించి.. ఉదయం పదినుంచి సాయంత్రం అయిదు వరకు, ఏకంగా ఏడుగంటల పాటు విచారించారు. ప్రాథమికంగా కొన్ని వివరాలు రాబట్టారు. చాలా ప్రశ్నలకు ఆయన తప్పించుకునే ధోరణిలోనే సమాధానాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే పోలీసులు తమ వద్ద ఉన్న ఆధారాలు, కాల్ డేటా రికార్డులు, సాక్షుల వాంగ్మూలాలు అన్ని చూపించి ప్రశ్నించడంతో రాజ్ కెసిరెడ్డి నీళ్లు నమిలినట్లుగా తెలుస్తోంది.
ప్రధానంగా లిక్కర్ స్కామ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు, అంతిమ లబ్ధిదారులు ఎవరో రాజ్ కెసిరెడ్డి ద్వారా రాబట్టడమే ప్రధానంగా పోలీసులు విచారిస్తున్నారు. రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం కావడంతో.. చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. చాలా కోణాల్లోంచి వివరాలు రాబట్టాల్సిన అవసరం ఉన్నందు.. ఏకంగా ఏడు రోజుల పాటు కస్టడీ విచారణకు కోరడం జరిగింది. కోర్టు కూడా అందుకు అనుమతించింది. తొలిరోజు ఏడుగంటల పాటు విచారించినా.. రాజ్ కెసిరెడ్డి వారి ప్రశ్నలకు పెద్దగా సహకరించలేదు. ఏడురోజుల పాటు సాగే విచారణలో.. ఆయన ఎన్నాళ్లపాటు ఇలా బుకాయించగలరు.. ఏదో ఒకనాటికి నిజాలు చెప్పి తీరాల్సిందే కదా.. సూటిగా మాట్లాడాల్సిందే కదా.. అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.