ఏడురోజుల విచారణ : లోగుట్టులన్నీ కక్కాల్సిందే!

జగన్మోహన్ రెడ్డి జమానాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలకనేతలందరూ కలిసి దాదాపు 3500 కోట్ల రూపాయలకు పైగా కాజేసిన అతిపెద్ద కుంభకోణం.. లిక్కర్ స్కాం. ఈ కేసులో ఇప్పటిదాకా పలువురు అరెస్టు అయ్యారు. వారిలో ప్రధాన నిందితుడుగా, కర్తకర్మక్రియగా అందరూ పేర్కొంటున్న కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా ఉన్నాడు. అయితే.. ఇప్పటిదాకా జరిగిన అరెస్టులన్నీ కూడా జుజుబీ అరెస్టులే అనే అభిప్రాయం విశ్లేషకుల్లో వ్యక్తం అవుతోంది. రాజ్ కెసిరెడ్డి ని వారంరోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించడానికి కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో.. ఇక ఎక్కడెక్కడి రహస్యాలన్నీ బయటకు రాక తప్పదని పలువురు భావిస్తున్నారు.

ప్రధాన సూత్రధారి రాజ్ కెసిరెడ్డిని ప్రతిరోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఏడు రోజుల పాటు విచారించనున్నారు. ప్రభుత్వానికి ఐటీ సలహాదారు మాత్రమే అయిన తనకు లిక్కర్ కుంభకోణంతో ఎలా సంబంధం ఉంటుందని ఎదురు ప్రశ్నించడంతో ప్రారంభించిన రాజ్ కెసిరెడ్డి.. అరెస్టు అయిన తర్వాత చాలా వివరాలు వెల్లడించారు. కెసిరెడ్డి అరెస్టుకు ముందే.. విజయసాయిరెడ్ది, ఎంపీ మిథున్ రెడ్డిలను కూడా సాక్షులుగా సిట్ పోలీసులు విచారించారు.

కెసిరెడ్డిని అరెస్టు చేసి విచారించిన తర్వాత ఆ ఇద్దరినీ కూడా నిందితుల జాబితాలో చేర్చారు. రాజ్ తర్వాత ఆయన తోడల్లుడు చాణక్యను, సజ్జల శ్రీధర్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు. తాజాగా రాజ్ కెసిరెడ్డి వద్ద పీఏగా పనిచేసిన పైలా ప్రదీప్ ను కూడా చెన్నైలో అరెస్టు చేశారు. సో, ఎవరెవరైతే కీలక పాత్రధారులుగా మద్యం కుంభకోణంలో వ్యవహరించారో వారందరూ ఇప్పుడు పోలీసులకు అందుబాటులోనే రిమాండులో ఉన్నట్టు లెక్క! తొలివిడతలో రాజ్ కెసిరెడ్డిని ఏడు రోజుల పాటు విచారించాలని పోలీసులు కోరగానే కోర్టు అందుకు అనుమతి ఇచ్చింది. ఈ ఏడురోజుల్లో ఆయన ఇప్పటిదాకా దాచిపెట్టిన రహస్యాలన్నింటినీ కక్కించగలం అని పోలీసులు అనుకుంటున్నారు.

అరెస్టు చేసిన తర్వాత.. పోలీసుల విచారణలో.. ఈ కుంభకోణంలో ప్రతి విషయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే చేశాం అంటూ సెలవిచ్చిన రాజ్ కెసిరెడ్డి.. ఆ వాంగ్మూలం మీద సంతకాలు చేయడానికి మాత్రం నిరాకరించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు అలా ఉండకపోవచ్చునని.. అవసరమైన మేర వీడియో రికార్డింగు కూడా చేసే అవకాశం ఉన్నదని పలువురు భావిస్తున్నారు. రాజ్ తో పాటు, ప్రస్తుతం అరెస్టు చేసిన పైలా ప్రదీప్ ను కూడా కలిపి విచారిస్తే గనుక.. మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు నమ్ముతున్నారు. విశ్లేషకుల్లో మరో అంచనా ఏం నడుస్తున్నదంటే..  ఈ ఏడురోజుల్లో రాజ్ కెసిరెడ్డి ద్వారా సేకరించగల వివరాలను బట్టి.. ఆ తరువాత.. విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలను కూడా అరెస్టు చేసే అవకాశం ఉన్నదని అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories