అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు అన్నట్టుగా ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. రాయలసీమకు వైఎస్సార్ కాంగ్రెస్ తలపెట్టిన తాజా ద్రోహానికి హైకోర్టులో బ్రేకు పడింది. రాయలసీమ ప్రాంతమైన కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిన నేపథ్యంలో.. దీనికి వ్యతిరేకంగా అమరావతి హైకోర్టులో ఒక పిల్ దాఖలైంది. అయితే బెంచ్ ఏర్పాటుకు సంబంధించి ఇంకా హైకోర్టు నిర్ణయం తీసుకోకుండానే.. పిల్ వేయడం ఏంటంటూ.. న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అర్థం పర్థంలేని పిల్ ను ఉపసంహరించుకోవాలంటూ సూచించింది. అయితే ప్రభుత్వ ప్రయత్నానికి అడ్డుతగలడమే లక్ష్యంగా పెట్టుకున్న పిటిషన్ దారు.. హైకోర్టు నిర్ణయం తీసుకునేదా పెండింగులోనే ఉంచాలని కోరడం విశేషం. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు ప్రయత్నానికి అడ్డు తగులుతున్న ఈ పిటిషన్ దారువెనుక నుంచి వైసీపీ నేతలే నడిపిస్తున్నట్టుగా ప్రజలు అనుకుంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత.. కేవలం అమరావతిని స్మశానంలాగా మార్చేయడం తన జీవితాశయం అయినట్టుగా.. పగబట్టారు. అందుకోసం వక్రబుద్ధితో మూడు రాజధానుల కాన్సెప్టును తెరపైకి తెచ్చారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధాని అనే భ్రమలో పెడుతూ, అమరావతి శాసన రాజధాని అని, కర్నూలు న్యాయరాజధాని అని అన్నారు. కర్నూలులో చీఫ్ జస్టిస్ తో కూడిన హైకోర్టును ఏర్పాటుచేస్తా.. అని డాంబికంగా పలికారు. ఇలాంటి మాటలు చెప్పడానికి ముందు హైకోర్టు చీఫ్ జస్టిస్ అనుమతి ఉండాలనే విషయాన్ని కూడా విస్మరించారు. ఇలాంటి ప్రకటన చేశారే తప్ప.. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికైనా ఆయన చేసిన నిర్దిష్టమైన ప్రయత్నం ఏమీ లేదు. కేంద్రానికి ఒక లేఖ రాసి అక్కడితో చేతులు దులుపుకున్నారు. మూడురాజధానుల కాన్సెప్టు మాటలు తప్ప చేతల్లో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ మోసాలను గుర్తించిన ప్రజలు జగన్ ను చిత్తుగా ఓడించారు.
తీరా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. తాము తొలినుంచి చెబుతున్న కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రయత్నాలను ప్రారంభించింది. హైకోర్టు రిజిస్ట్రార్ అవసరమైన భవనాల ఎంపిక కోసం కర్నూలు కలెక్టరుకు లేఖ రాయడంకూడా జరిగింది. సమాంతరంగా ఆ ప్రక్రియ మొత్తం నడుస్తోంది. దీంతో వైసీపీ కి కన్నుకుట్టింది. జగన్ తరఫు కుట్రదళాలు రంగంలోకి దిగాయి. బెంచ్ ఏర్పాటుపై ప్రభుత్వ కసరత్తును సవాలు చేస్తూ హైకోర్టులోనే పిల్ దాఖలైంది. ఇది నిబంధనలకు విరుద్ధం అని పిల్ లో పేర్కొన్నారు. విచారణలో భాగంగా హైకోర్టు న్యాయపీఠం ఆగ్రహించింది. అసలు బెంచ్ ఏర్పాటు నిర్ణయం తీసుకోకముందే.. పిల్ వేసేంత అత్యుత్సాహం ఎందుకంటూ ప్రశ్నించింది. విత్ డ్రా చేసుకోవాలంటూ సూచించింది. కనీసం పెండింగులో పెట్టాలని పిటిషనర్ కోరాక.. విచారణ వాయిదా వేసింది.
పిల్ సంగతి ఎలా ఉన్నప్పటికీ.. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలకు జగన్ దళాలు మోకాలడ్డడం వారి దుర్బుద్ధులను బయటపెడుతున్నాయని ప్రజలు అనుకుంటున్నారు.